'కరాచీలో ఉగ్రదాడి భారత్ పనే'.. పాకిస్థాన్‌ ఆరోపణలకు ఇండియా స్ట్రాంగ్ వార్నింగ్!

Wait 5 sec.

కరాచీలో జరిగిన ఉగ్రదాడి భారత్ పనేనంటూ పాకిస్థాన్ చేసిన ఆరోపణలను ఇండియా తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్‌పై నిందలు మోపడం మానుకోవాలని ఘాటుగా సమాధానం ఇచ్చింది. శనివారం రాత్రి కరాచీలోని పాకిస్థాన్ రేంజర్స్ ప్రావిన్షియల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు భద్రతా సిబ్బంది మరణించారు. వీరితో పాటు మరో ముగ్గురు ఉగ్రవాదాలు కూడా మృతిచెందారు. తాలిబన్ నుంచి విడిపోయిన జమాత్ ఉల్ అహ్రార్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత వహించింది. అయితే, ఈ దాడి భారత్ ప్రోత్సహించిన ఉగ్రవాదుల పనే అంటూ పాకిస్థాన్ సైన్యం, ఆ దేశ హోం మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఆరోపణలు చేశారు. ఎలాంటి ఆధారాలు చూపకుండానే భారత్‌పై పాక్ బురద చల్లే ప్రయత్నం చేసింది. పాకిస్థాన్ చేసిన ఆరోపణను భారత్ పూర్తిగా ఖండించింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్ మాట్లాడుతూ "కరాచీ ఘటనపై భారత్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. వాటిని మేము ఖండిస్తున్నాం. ఇతరులపై వేలెత్తి చూపే బదులు, పాకిస్థాన్ తన దేశంలో ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంలో భాగంగా ఉపయోగించే ధోరణిని విడనాడాలి" అంటూ పేర్కొన్నారు. పాకిస్థాన్ సైన్యం తెలిపిన వివరాల మేరకు.. కరాచీలోని పాకిస్థాన్ రేంజర్స్ ప్రధాన కార్యాలయంలోకి పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని ఓ ఉగ్రవాది తీసుకెళ్లాడు. ఆ వాహనంలో ఒక్కసారిగా దూసుకెళ్లడంతో భారీ పేలుడు సంభవించింది. ఆ తర్వాత ఉగ్రవాదులు, పాకిస్థాన్ ఆర్మీ మధ్య తీవ్ర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు రేంజర్స్ మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. ఉగ్రవాదుల్లో కూడా ముగ్గురు మరణించగా, మరో వ్యక్తిని సజీవంగా పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి అప్ఘనిస్థాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ దాడికి బాధ్యులైన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్థాన్ సైన్యం ప్రకటించింది. ఈ ఘటనతో అప్ఘనిస్థాన్‌తో పాటు పాక్ - భారత్ మధ్య హీట్ మళ్లీ మొదలైనట్లు కనిపిస్తోంది.