Movie: ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో డెరెక్టర్ వంశీ రెడ్డి దొండపాటి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ . సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు సమర్పణలో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో టైటిల్‌పై పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. సినిమా టైటిల్ అనౌన్స్ అయిన తర్వాత.. సోషల్ మీడియాలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు నెటిజన్లు పేరును హేళన చేస్తూ పోస్టులు పెట్టారు. 'ఇదేం భాష? అసలు ఇది తెలుగేనా?.. ఈ సినిమాను తెలుగు భాషలోకి డబ్ చేస్తారా?' అని కొందరు.. సినిమాకు సబ్‌టైటిల్స్ కావాలంటూ మరికొందరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడంతో ఇది కాస్తా ఆంధ్ర వర్సెస్ తెలంగాణ భాషా వివాదంగా మారింది. ఈ ట్రోల్స్‌పై తెలంగాణ మేధావులు, నెటిజన్లు, కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ భాషపై గతంలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు చేసి కామెంట్స్ వీడియో వైరల్‌గా మారింది. తెలంగాణకు చెందిన కొందరు నెటిజన్లు ఆయన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఏపీ ప్రాంతానికి చెందిన వారికి కౌంటర్ ఇస్తున్నారు. ఆ వీడియోలో గరికపాటి మాట్లాడుతూ.. "తెలంగాణ భాష మెుత్తం గ్రాంథిక భాషకు చాలా దగ్గరైన భాష. వ్యాకరణం తెలిసిన వారు పరిశీలిస్తే ఆ విషయం అర్థమవుతుంది. మాములుగా తెలంగాణలో 'చేసిన్రు' అనే పదం వాడుతుంటారు.. పద్యాల్లో అదే పదాన్ని 'చేసినారు' అని వాడుతాం. నా కింద రా వత్తు వస్తే చేసినారు అయింది. నిస్పక్షపాతంగా మాట్లాడుకోవాలి.. నేను కవిని.. నాకు ప్రపంచంలో ఎవైరనా సరై భగవంతుడితో సమానం. నాకు ప్రాంతాలతో నిమిత్తం లేదు. పక్కాగా చెబుతున్నా.. ఎవరితో వాదించటానికైనా సిద్ధం. తెలంగాణ భాష శాస్త్రీయమైన భాష. గ్రాంథిక భాషకు చాలా దగ్గరగా ఉండే భాష. తెలంగాణలో వాడే పదాలు సరైనవి. తెలంగాణలోని భాష ఇంకా గ్రాంథికంలోనే ఉండటానికి ప్రధాన కారణం దిక్కుమాలిన ఇంగ్లీష్ భాష ప్రభావం అక్కడ చాలా తక్కువ. ఆ ఆంగ్లేయ దుర్మార్గులు సర్కార్ జిల్లాలో ప్రవేశించి అక్కడ మెత్తం నాశనం చేశారు. నోరు విపిత్తే ఇంగ్లీష్ తప్ప తెలుగు లేదు. బందర్‌లో ప్రవేశించి.. అక్కడ మెుత్తం మార్చేశారు. అందుకే అక్కడి పదాలు మారిపోయాయి. ఆచారాలు మారిపోయాయి." అని గరికపాటి కామెంట్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'భలే చేపిండ్రు గురువు గారు.. తెలంగాణ భాష గురించి బరాబార్ చెప్పిన్రు' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇడుపు కాయితం విషయానికొస్తే.. అది అచ్చమైన తెలంగాణ గ్రామీణ వ్యవహారిక పదమని తెలంగాణ భాషాభిమానులు చెబుతున్నారు. పాత కాలంలో భార్యాభర్తలు కలిసి బతకలేమని నిర్ణయించుకున్నప్పుడు.. కోర్టుల చుట్టూ తిరగకుండా.. గ్రామంలోని పెద్ద మనుషుల సమక్షంలో విడిపోవడానికి రాసుకునే ఒప్పంద పత్రాన్ని అంటే విడాకుల పత్రాన్ని తెలంగాణలో ఇడుపు కాయితం అని పిలుస్తారని చెబుతున్నారు.