కరాచీ దాడికి ప్రతీకారం తీర్చుకున్న పాక్.. అప్ఘనిస్థాన్‌లో భీకర దాడులు, 29 మంది హతం!

Wait 5 sec.

కరాచీ రేంజర్స్ కార్యాలయంపై ఉగ్రదాడి తర్వాత పాక్ - అప్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. కరాచీ దాడి జరిగిన తర్వాత రోజే అప్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించి, 29 మంది తీవ్రవాదులను హతమార్చినట్లు పాకిస్థాన్ వెల్లడించింది. అయితే, ఈ దాడుల్లో సాధారణ పౌరులు కూడా మృతిచెందారని అప్ఘనిస్థాన్ తాలిబన్ ప్రభుత్వం ఆరోపించింది. తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ తూర్పు అప్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ దాడులు చేసిందని వెల్లడించారు. ఈ దాడుల్లో సాధారణ పౌరులే ఎక్కువ మంది మృతిచెందారని, అనేకమంది గాయపడ్డారని తెలిపారు. పాక్ చేసిన ఈ దాడులను పిరికిపంద చర్యగా అప్ఘనిస్థాన్ పేర్కొంది. కరాచీలోని సింధ్ రేంజర్స్ ప్రధాన కార్యలయంపై పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో ఉగ్రవాదులు దాడి చేశారు. అనంతరం లోపలికి వెళ్లి విచక్షణారహితంగా కాల్పులు జరిపి, గ్రెనేడ్లు విసిరి రక్తపాతం సృష్టించారు. పాకిస్థాన్ భద్రతా బలగాలు కూడా ప్రతిదాడి చేశాయి. ఇరు వర్గాల మధ్య సుమారు 90 నిమిషాల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ దాడుల్లో పాకిస్థాన్ సిబ్బంది ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఉగ్రవాదులు కూడా ముగ్గురు మరణించారు. ఈ దాడికి తెహ్రీక్ - ఎ- తాలిబాన్ అనే పాకిస్థాన్ సంస్థ నుంచి విడిపోయిన జమాత్ ఉల్ అహ్రార్ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించింది. పాకిస్థాన్ సమాచార మంత్రి అత్తౌల్లా తరార్ ప్రకారం.. అప్ఘనిస్థాన్‌లోని పక్తియా, పక్తికా, కునార్ ప్రావిన్సుల్లో ఉన్న మూడు లక్ష్యాలపై గ్రౌండ్ ఆపరేషన్ చేసినట్లు వెల్లడించారు. అనంతరం టార్గెట్ చేసుకుని వైమానిక దాడులు కూడా చేసినట్లు పాక్ ప్రకటించింది. ఈ ఆపరేషన్‌లో మొత్తం 29 మంది మిలిటెంట్లు హతమయినట్లు పాక్ మంత్రి తెలిపారు. బలోచిస్థాన్ సాధన లక్ష్యంగా పోరాటం ప్రారంభమైనప్పటి నుంచి పాకిస్థాన్ - అప్ఘనిస్థాన్ మధ్య తీవ్ర స్థాయిలో దాడులు మొదలయ్యాయి. గతంలో కూడా అప్ఘన్‌పై పాక్ ఎయిర్ స్ట్రైక్ చేసి ఎంతోమంది సామాన్యుల మరణానికి కారణమైంది. పాక్ దాడులకు అప్ఘన్ కూడా ప్రతిదాడులు చేస్తోంది. కరాచీ సంఘటనతో ఇరు దేశాల మధ్య పరిస్థితులు తీవ్ర స్థాయికి వెళ్లాయి.