ICICI Bank Market Value: అమెరికా- ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందం కుదరడం, ఆ తర్వాత చర్చలు కూడా సానుకూలంగా సాగుతున్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు మంచి లాభాలు నమోదు చేస్తున్నాయి. వరుస సెషన్లలో లాభాల్లోనే కొనసాగుతుండటం విశేషం. ఇక కిందటి వారం (జూన్ 22- 26) చూస్తే ఒక రోజు (శుక్రవారం) మొహర్రం సందర్బంగా స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంది. ఇక జూన్ 22- 25 మధ్య 4 రోజుల్లో స్టాక్ మార్కెట్లు ఓవరా‌ల్‌గా చూస్తే లాభాల్లోనే ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 298 పాయింట్లు పుంజుకోగా, నిఫ్టీ చూస్తే మరోవైపు 43 పాయింట్లు ఎగబాకింది. ఈ క్రమంలోనే మార్కెట్లు లాభాల్లో ముగియగా ఇన్వెస్టర్ల సంపద కూడా విపరీతంగా పెరిగింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువనే ఈ ఇన్వెస్టర్ల సంపదగా పరిగణిస్తుంటారు. ఇక టాప్- 10 కంపెనీల్లో 6 కంపెనీల మార్కెట్ వాల్యుయేషన్ కిందటి వారం రూ. 88,678.1 కోట్లు పెరిగింది. ఈ మేరకు వీటి నుంచి ఇన్వెస్టర్లు లాభపడ్డారని చెప్పొచ్చు. మిగతా 4 కంపెనీల నుంచి నష్టాలు వచ్చాయి. ఇందులో అత్యధికంగా కిందటి వారంలో ఐసీఐసీఐ బ్యాంకు షేరు భారీగా పుంజుకోగా దీని మార్కెట్ విలువ రూ. 29588.75 కోట్లు పెరిగి రూ. 9.95 లక్షల కోట్లకు ఎగబాకింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ వాల్యుయేషన్ గత వారంలో రూ. 24,718.3 కోట్లు పెరిగి.. రూ. 12.25 లక్షల కోట్లుగా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ. 12 వేల కోట్లు పెరిగి రూ. 17.83 లక్షల కోట్ల వద్ద ఉంది. బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 11580.28 కోట్లు ఎగబాకి రూ. 6.10 లక్షల కోట్లుగా ఉంది. ఎస్బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ కిందటి వారం రూ. 9,322 కోట్లు పెరిగి రూ. 9.64 లక్షల కోట్లుగా ఉంది. ఎల్అండ్‌టీ రూ. 1423 కోట్లు పెరిగి రూ. 5.80 లక్షల కోట్లకు చేరుకుంది.ఇదిలా ఉండగా భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ విలువ రూ. 35,615 కోట్ల పతనంతో రూ. 11.27 లక్షల కోట్లకు పతనమైంది. ఎల్ఐసీ మార్కెట్ క్యాప్ రూ. 21 వేల కోట్లు పడిపోయి రూ. 5.35 లక్షల కోట్లుగా ఉంది. టీసీఎస్ ఎం- క్యాప్ రూ. 11 వేల కోట్లు తగ్గడంతో కిందటి వారం రూ. 7.58 కోట్లుగా నమోదైంది. హిందుస్థాన్ యూనిలివర్ మార్కెట్ విలువ కూడా గత వారంలో రూ. 5,320 కోట్లు తగ్గి రూ. 5.10 లక్షల కోట్ల వద్ద ఉంది.