బంగారం ధరలు భారీగా పడిపోతాయా? పాత గోల్డ్ అమ్మేస్తున్న జనాలు.. షాకింగ్ లెక్కలిదిగో

Wait 5 sec.

: బంగారం ధరల్లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించడమే కష్టంగా మారుతోంది. కొంత కాలంగా రికార్డు స్థాయి నుంచి భారీగా పడిపోతుండగా, ఇంకా పడిపోతాయేమోనన్న భయాందోళనలు నెలకొన్నాయి. ఇవే భయాలు ఇన్వెస్టర్లతో పాటు సామాన్యుల్లోనూ నెలకొంది. ఈ ధరల పతనం భయంతో దేశవ్యాప్తంగా జనం తమ ఇళ్లలో ఉన్న పాత బంగారాన్ని భారీగా విక్రయిస్తున్నారు. తాజా నివేదికలు ఇవే సూచిస్తున్నాయి. ఇండియన్ బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ (IBJA) లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం గత 3 నెలల్లోనే ఏకంగా 50 టన్నులు అంటే 50 వేల కిలోల వరకు పాత పసిడిని జనాలు క్యాష్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అసలు మార్కెట్లో ఈ భయానికి కారణాలేంటి? ఇంతకీ నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. సమీక్షా త్రైమాసికంలో 50 టన్నులుగా ఉండగా ఇది అంతకుముందు ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 43 శాతం వరకు పెరిగింది. కొద్ది రోజుల కిందటి వరకు బంగారం ధర 22 క్యారెట్లకు తులం రూ. 1.40 లక్షల మార్కు వద్ద ఉండగా.. రానున్న రోజుల్లో రూ. 1.20 లక్షలకు దిగొస్తుందన్న అంచనాలతోనే పాత పెరిగినట్లు భావిస్తున్నారు.ధరలు ఇంకా తగ్గితే లాభాలు రావన్న ఆందోళనలతో ఇక్కడ కొత్త ఆర్నమెంట్స్ కోసం పాత బంగారు ఆభరణాల్ని ఎక్స్చేంజ్ చేయడంతో పోలిస్తే.. అమ్మి లాభాల్ని సొమ్ము చేసుకోవడంపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇటీవల అమెరికా- ఇరాన్ యుద్ధం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు పెరగడంతో బంగారం ధరలు భారీగా తగ్గుతూ వచ్చాయి. మరోవైపు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న భయాల నేపథ్యంలోనూ బంగారం ధర తగ్గుతూ వస్తోంది.మరోవైపు బంగారానికి సంబంధించి భారతదేశం అధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. బంగారం దిగుమతుల విషయంలో, ఇంకా వినియోగానికి సంబంధించి కూడా భారత్.. చైనాతో కలిసి ముందు వరుసలో ఉంటుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు 72.4 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకుంది. ఇప్పుడు బంగారం ధర తగ్గుతుండటంతో జనం లాకర్ల నుంచి బంగారు ఆభరణాల్ని బయటికి తీసి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం భారతీయ కుటుంబాల వద్ద సుమారు 30 వేల టన్నుల వరకు పసిడి ఉందని అంచనా. ఇప్పుడు పాత బంగారం విక్రయంతో మార్కెట్లోకి పసిడి లభ్యత పెరిగి రీసైక్లింగ్ ఇండస్ట్రీకి మేలు జరుగుతుంది. ఇదే కొనసాగితే బంగారం దిగుమతులు తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఊతం అందించినట్లు అవుతుంది.