విజయనగరం జిల్లా వైసీపీ కార్యాలయ నిర్మాణం వివాదంలో చిక్కుకుంది. వైసీపీ కార్యాలయాన్ని తమ స్థలంలో నిర్మించారని గోవా గవర్నర్ పూసపాటి అశోక్‌ గజపతి రాజు ఆరోపించారు. విజయనగరంలో విలేకర్ల సమావేశం నిర్వహించిన దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. వైసీపీ జిల్లా ఆఫీసును తమ స్థలంలో నిర్మించారని.. దీనిపై సంవత్సరం కిందే కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారని అశోక్ గజపతి రాజు ఆరోపించారు. అనుమతులు లేకుండానే పార్టీ ఆఫీస్ కట్టారని.. చట్టాలను అతిక్రమించి నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. ప్రభుత్వం పార్టీలకు స్థలాన్ని కేటాయించడాన్ని తాను వ్యతిరేకించడం లేదన్న అశోక్ గజపతి రాజు.. ప్రైవేట్ స్థలం, ప్రభుత్వ స్థలంగా ఎలా మారిందని ప్రశ్నించారు. విజయనగరం సంస్థానానికి కొన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సంస్థానాల విలీనం సమయంలో ఇవి ప్రైవేట్ ఆస్తులుగా మారాయి. వీటికి అశోక్ గజపతి రాజు తండ్రి అయి పీవీజీ రాజు.. ట్రస్టీగా వ్యవహరించేవారు. పీవీజీ రాజు పర్యవేక్షణలో మాన్సాస్‌ ట్రస్టు పేరుతో భూముల బదలాయింపు చేశారు. మహారాజుపేట 569 సర్వే నంబర్‌లోని భూమి విజయనగరం ఎస్టేట్‌కు చెందిన ప్రైవేటు భూమిగా ఉండేది. అయితే 2022 జనవరిలో తనిఖీ చేపట్టిన తర్వాత స్థానిక తహశీల్దారు దానిని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ కలెక్టర్‌ సూర్యకుమారికి నివేదిక ఇచ్చారు. ఈ క్రమంలోనే సర్వే నంబర్‌ 569లోని ఎకరా స్ధలాన్ని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ అప్పటి ఏపీ ప్రభుత్వం వైసీపీకి 33 ఏళ్ల లీజుకు ఇచ్చింది. ఆ తర్వాత జూన్ నెలలో ఆ భూమిని తహసీల్దార్‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అప్పగించారు.అయితే ఏపీ సర్వే ఆండ్‌ బౌండర్సీ యాక్ట్‌-1923 నిబంధనలు ఉల్లంఘిస్తూ భూ యజమాని అయిన తమకు నోటీసులు ఇవ్వకుండానే ఈ భూమిపై నిర్ణయం తీసుకున్నారని అశోక్‌ గజపతి రాజు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై 2025 మే 23న కలెక్టర్‌కు లేఖ రాసినా పట్టించుకోలేదని అశోక్ గజపతి రాజు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల అశోక్ గజపతి రాజు విజయనగరం కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ ఆఫీస్ నిర్మాణం కోసం కేటాయించిన ఎకరా భూమి తమదేనని.. 2022 ఫిబ్రవరి 8 వరకూ ఈ భూమి ప్రభుత్వ రికార్డుల్లో ప్రైవేటు భూమిగానే ఉండేదని ఆయన చెప్తున్నారు. చట్టబద్ధ వారసులైన తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా రికార్డులు మార్చారని ఆయన ఆరోపిస్తున్నారు.