తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఒక్క రోజు కూడా విరామం తీసుకోవడం లేదని.. నిత్యం ప్రజల కోసమే పనిచేస్తున్నారని ప్రశంసలు గుప్పించారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిల తర్వాత.. మళ్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ స్థాయిలో పనిచేస్తున్నారని పొగడ్తలతో ముంచెత్తారు. సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొనియాడారు. తాజాగా నల్గొండ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన మంత్రి కోమటిరెడ్డి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క పేద కుటుంబానికి కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేకపోయిందని మండిపడ్డారు. పశువులు తినే దాణా లాంటి నాసిరకం బియ్యాన్ని.. కేసీఆర్ ప్రభుత్వం పేదలకు రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు పంపిణీ చేసిందని ఆరోపించారు. కనీసం రోడ్లపై ఉన్న గుంతలను కూడా కేసీఆర్ పూడ్చలేదని ఎద్దేవా చేశారు. కానీ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో రోడ్లు, భవనాల శాఖకు రాష్ట్ర ప్రభు్తవం భారీగా నిధులు కేటాయించింది. ఇంటి నుంచి బయటికి వెళ్లిన ప్రతీ ఒక్కరు.. తిరిగి సురక్షితంగా, క్షేమంగా ఇంటికి చేరాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం రోడ్లను అధునాతనంగా అభివృద్ధి చేస్తోందని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. టెండర్లు పూర్తి కాకముందే హ్యామ్ (HAM) రోడ్లలో భారీ కుంభకోణం జరిగిందంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి పోర్టల్ పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అడ్డంగా దోచుకుందని తీవ్ర ఆరోపణలు చేశారు.ఇక బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు, ఆ పార్టీ భవిష్యత్తుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఉనికి కోల్పోతుందని.. ఆ పార్టీ ఇక హరీష్ రావు రాష్ట్ర సమితిగా మారడం ఖాయమని జోస్యం చెప్పారు. గతంలో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో.. నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం కలుస్తామని ఎన్నోసార్లు అడిగినా.. కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని.. ఆయన ఒక అహంకారి అని మండిపడ్డారు. గతంలో తెలంగాణ ఏర్పాటు కాక ముందు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కూడా.. తనపై కేసులు పెట్టించారని.. అయినప్పటికీ తాను ప్రజల పక్షానే నిలబడినట్లు గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తనకు పూర్తి అవగాహన ఉందని చెప్పిన మంత్రి కోమటిరెడ్డి.. అందుకే రాష్ట్ర ప్రభుత్వంపై ఎక్కువగా డిమాండ్లు పెట్టి ఇబ్బంది పెట్టబోనని తెలిపారు.ఇక నల్గొండ జిల్లా ప్రజలకు ఎన్నో దశాబ్దాల కల అయిన ఎస్ఎల్‌బీసీ సొరంగ మార్గం ప్రాజెక్టును 2028 ఆగస్ట్ నాటికి మొత్తం పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగానే నల్గొండ జిల్లా ప్రజలకు సాగు, తాగు నీటిని అందిస్తామని భరోసానిచ్చారు. అదే సమయంలో మూసీ నది ప్రక్షాళనపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి.. మూసీ నదిని శుద్ధి చేసి సాగు, తాగు నీరు ఇవ్వండి అని ప్రజలెవరూ అడగలేదని.. కానీ వారి భవిష్యత్తు, ఆరోగ్యం కోసమే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ముందుండి మూసీ నది ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారని ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాలే.. మళ్లీ తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మొత్తం 12 అసెంబ్లీ స్థానాల్లో హస్తం జెండా రెపరెపలాడుతుందని మంత్రి కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.