విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మందన జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'ర‌ణ‌బాలి'. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. 'టాక్సీవాలా' తర్వాత విజయ్ - రాహుల్ కాంబోలో రూపొందుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. గత కొన్నేళ్లుగా వరుస ప్లాప్స్ ఎదురుకుంటున్న విజయ్.. ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. అయితే ఈ చిత్రం షెడ్యూల్ చేసిన టైంకి రిలీజ్ కావడం కావడం లేదని తెలుస్తోంది. 'ర‌ణ‌బాలి' చిత్రాన్ని 2026 సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ లో చిత్ర బృందం అదే తేదీని ప్రస్తావిస్తూ వచ్చింది. ఇవాళ రాహుల్ సాంకృత్యాన్ పుట్టినరోజు సందర్భంగా ''రణబాలి'ని టైమ్ లెస్ సినిమాగా మలుస్తున్న మా దార్శనికుడికి శుభాకాంక్షలు'' అంటూ టీమ్.సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ను పంచుకుంది. అయితే ఇందులో రిలీజ్ డేట్ మిస్ అయింది. దీంతో సినిమా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 14న వినాయక చవితి పండగ ఉండటంలో, 'రణబాలి' సినిమాకి మంచి డేట్ దొరికిందని ఫ్యాన్స్ భావించారు. లాంగ్ వీకెండ్ దగ్గర భారీ ఓపెనింగ్స్ రాబట్టడానికి అవకాశం లభిస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు విడుదల వాయిదా పడుతుందని టాక్ వినిపిస్తుండటంతో, నిరాశ చెందుతున్నారు. ఆల్రెడీ మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాని పోస్ట్ పోన్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వీలైనంత త్వరగా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' తర్వాత విజయ్ దేవరకొండ - రష్మిక కలిసి నటిస్తున్న సినిమా 'రణబాలి'. భార్యాభర్తలుగా మారిన తర్వాత విరోష్ నుంచి రాబోయే తొలి సినిమా కావడం విశేషం. 1854 - 1878 మధ్య కాలంలో బ్రిటీష్ ఇండియాలో రాయలసీమ ప్రాంతంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా రూపొందుతోంది. ఇందులో రణబాలి అనే వీరుడిగా విజయ్ నటిస్తుండగా.. ఆయన భార్య జయమ్మ పాత్రలో రష్మిక కనిపించనుంది. సౌత్ ఆఫ్రికన్ యాక్టర్ ఆర్నాల్డ్ వోస్లూ విలన్ క్యారక్టర్ ప్లే చేస్తున్నారు. టీ-సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో నవీన్ యెర్నేని & వై. రవిశంకర్ 'రణబాలి'చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్ - అతుల్ సంగీతం సమకూరుస్తున్నారు. నీరవ్ షా, జిష్ణు భట్టాచార్జీ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది.