విదేశాల నుంచి బంగారాన్ని తీసుకొచ్చి తక్కువ ధరకే విక్రయిస్తామని అమాయక ప్రజలను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్‌.. పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు. తక్కువ ధరకు బంగారం పేరుతో సూర్య భాయ్ బురిడీ కొట్టించాడు. బంగారం ఇవ్వడం సంగతి పక్కన పెడితే.. తాము ఇచ్చిన డబ్బులైనా తిరిగి ఇవ్వాలని అడిగితే.. ఏకంగా వారిపైనా కేసు పెట్టాడు. చివరికి గోల్డ్ మ్యాన్ అసలు రంగు బయటపడింది. ఈ క్రమంలోనే ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. అతడు పారిపోయేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు.విదేశీ బంగారాన్ని తక్కువకే ఇప్పిస్తానని.. పలువురి నుంచి సూర్య భాయ్ రూ.లక్షలను వసూలు చేసి.. భారీ మోసానికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్ మాటలు నమ్మిన హిమాయత్‌నగర్‌, నీలోఫర్‌‌‌కు చెందిన కొంతమంది బాధితులు దాదాపు రూ.30 లక్షలు అతడికి ఇచ్చారు. అయితే బంగారం ఇవ్వకపోవడంతో.. ఎందుకు ఇవ్వలేదని అతడి ఇంటికి వెళ్లి బాధితులు నిలదీశారు. తమకు బంగారం ఏమొద్దని.. మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వాలని వారు కోరారు. ఈ క్రమంలోనే తన వద్ద ఉన్న 3 ఐఫోన్లు వారికి ఇచ్చి.. వాటి విలువ రూ.10 లక్షలు ఉంటుందని.. అదే సమయంలో రూ.20 లక్షల చెక్ ఇచ్చి బాధితులను పంపించేశాడు.ఆ తర్వాత తమపైనే తిరిగి సూర్య భాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారని బాధితులు వాపోయారు. వారు తనను బెదిరించారని.. ఫోన్ లాక్కెళ్లారని సూర్య భాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై దర్యాప్తు చేసిన పోలీసులు.. అసలు నిజాన్ని బయటికి తీశారు. సూర్య భాయ్‌పై కేసు నమోదు చేసిన అత్తాపూర్ పోలీసులు.. ఆ తర్వాత ఈ కేసును నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ భయంతో సూర్య భాయ్ హైదరాబాద్‌ నుంచి పారిపోయేందుకు ప్రయత్నం చేయగా.. షాద్‌నగర్‌లో పట్టుకుని పోలీసులు అరెస్ట్ చేశారు.