ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. స్లాబ్ సైజుపై సర్కార్ కీలక ఉత్తర్వులు

Wait 5 sec.

రాష్ట్రంలో గూడు లేని పేదలు ఉండకూడదనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా.. రెండో విడత ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలోనే ఇందిరమ్మ ఇళ్ల స్లాబు సైజుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. స్లాబు 500 అడుగుల నుంచి 750 అడుగులు మాత్రమే ఉండాలని తాజాగా జీవో వెలువరించింది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి.. స్లాబు ముందు వైపు 3 అడుగులు.. మిగిలిన వైపు ఒక అడుగు మాత్రమే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర గృహనిర్మాణ శాఖ కార్యదర్శి వీపీ గౌతమ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల స్లాబు విస్తీర్ణం పెరగడం వల్ల లబ్ధిదారులకు ఖర్చు పెరుగుతోందని హౌసింగ్‌ కార్పొరేషన్‌ తెలిపింది. లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ ఖర్చులు పెరగకూడదనే ఉద్దేశంతోనే స్లాబ్ విస్తీర్ణంపై ఆంక్షలు విధించినట్లు తేల్చి చెప్పింది.ఇల్లు లేని పేద, మధ్యతరగతి లబ్ధిదారుల ఇంటి నిర్మాణంలో అదనపు ఖర్చు పడుకోవద్దనే స్లాబ్ నిర్మాణ పరిమితులను విధించినట్లు హౌసింగ్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. స్లాబ్ సైజులు పెంచడం వల్ల ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షల ఆర్థిక సహాయం కంటే అదనంగా ఆర్థిక భారం పడుతోందని హౌసింగ్ కార్పొరేషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది.ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు అనవసరపు ఖర్చులతో అప్పుల పాలు కావద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి కారణమని అధికారులు పేర్కొన్నారు. కొత్తగా నిర్మించే ఇందిరమ్మ ఇళ్లతోపాటు.. ప్రస్తుతం బేస్‌మెంట్, స్లాబ్ లెవల్‌లో ఉన్న ఇళ్లకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని తేల్చి చెప్పారు. కొందరు లబ్ధిదారులు గోడల నుంచి 8 అడుగుల వరకు స్లాబులను పొడిగిస్తున్నారని.. దీనివల్ల వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. దాంతో ఇళ్ల నిర్మాణం మధ్యలోనే ఆగిపోతోందని అధికారులు గుర్తించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆంక్షలు తీసుకొచ్చింది.