కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి‌ భగీరథ్ చౌదరి వివాదంలో చిక్కుకున్నారు. తన సొంత మంత్రిత్వ శాఖ నుంచే దాదాపు రూ. 1 కోటి సబ్సిడీ తీసుకున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అయితే, ఈ ఆరోపణలను తోసిపుచ్చిన భగీరథ్ చౌదరి.. తాను ఏదీ దాచలేదని, ఆ సబ్సిడీ కోసం మంత్రి కాకముందే దరఖాస్తు చేసుకున్నానని ఆయన స్పష్టం చేశారు. ఏఎన్ఐ వార్తా సంస్థతో శనివారం మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే తాను వ్యవసాయం చేస్తున్నానని, తన ప్రాజెక్ట్ పూర్తిగా పారదర్శకంగా ఉందని తెలిపారు.‘‘నేను ఒక రైతును, చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాను.. నేను ఏమీ దాచలేదు. వేలాది మంది రైతులు పాలీహౌస్‌లను ఏర్పాటు చేసుకుని సబ్సిడీలు పొందుతున్నారు.. నేను కూడా అలాగే చేశాను. దీనికోసం 2018లోనే నేను దరఖాస్తు చేసుకున్నాను.. అక్కడ ఒక బోర్డును కూడా ఏర్పాటు చేసి, తీసుకున్న రుణాలు, సబ్సిడీల వివరాలన్నింటినీ రాశాను.. రైతులకు కొత్త సాంకేతికతలు, ప్రకృతి వ్యవసాయంపై అక్కడ శిక్షణ ఇస్తాను. స్థానిక అధికారులు కూడా దానిని సందర్శించారు. అలాంటప్పుడు నేను దాచింది ఏముంది?’’ అని ఆయన ప్రశ్నించారు.కేంద్ర మంత్రి భగీరథ చౌదరి తన సొంత రాష్ట్రం రాజస్థాన్‌లోని పర్బత్‌సర్ తహసీల్‌ పీహ్‌లో దోసకాయ సాగు కోసం సొంత మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక పథకం కింద రూ. 99.03 లక్షల సబ్సిడీని పొందారని, ఆయన ఎక్స్-అఫిషియో వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న బోర్డు ద్వారానే దీనిని ఆమోదించినట్టు ఓ ఇన్వెస్టిగేటివ్ నివేదిక బయటపెట్టింది. దీంతో ఆయన వివరణ ఇచ్చారు.మరోవైపు, దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీలను లక్ష్యంగా చేసుకున్న ఆయన.. మోదీ ప్రభుత్వంలో కొత్త తరహా అవినీతి నమూనా, ప్రయోజనాల ఘర్షణ అని ఆయన అభివర్ణించారు.ఇందులో ఒక కేంద్ర మంత్రి, కేంద్రంలో పనిచేస్తున్న ఒక ఐఏఎస్ అధికారిపై ఆరోపణలు ఉన్నాయని గెహ్లాట్ అన్నారు. ‘ కేంద్ర సహాయ మంత్రి తన సొంత మంత్రిత్వ శాఖ పథకం కింద తాను సాగు కోసం దాదాపు ఒక కోటి రూపాయల సబ్సిడీని మంజూరు చేయించుకుంటే దాన్ని ఏమనాలి? ఒకవైపు సామాన్య రైతు ప్రభుత్వ ప్రయోజనాలు పొందడానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంటే.. మరోవైపు మంత్రులు, వారికి నచ్చిన అధికారులు కోట్ల విలువైన ప్రభుత్వ సొమ్మును పొందుతున్నారు’ అని ఆయన ఆరోపించారు.‘‘నేను అవినీతికి పాల్పడను.. ఇతరులను చేయనివ్వను’’ అని చెప్పుకునే మోదీ ఈ ఆరోపణలపై మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు.. ప్రజలు ఈ ద్వంద్వ ప్రమాణాలను గమనిస్తున్నారని అశోక్ గెహ్లాట్ అన్నారు. కాంగ్రెస్ నేత పవన్ ఖేరా కూడా ‘‘దానం ఇంట్లోనే మొదలవుతుందని అంటారు... బీజేపీ విషయానికి వస్తే, సబ్సిడీ ఇంట్లోనే మొదలవుతుంది’’ అని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సాధారణ పౌరులు ఆధారపడి బతకాలని ఆశిస్తున్నారని, కానీ మంత్రులు, వారి కుటుంబాలు ప్రజాధనాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఖేరా ఆరోపించారు.