ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని.. రాయలసీమలో పసిడి పంటలు పండిస్తాయని నిపుణుల అంచనా. అయితే గతంలోనే బంగారం, వజ్రాలను రాశులుగా పోసి అమ్మిన నేల ఇది.. వందల ఏళ్ల నాటి చారిత్రక వైభవానికి సజీవ సాక్ష్యమిది. జొన్నగిరిగా ఇప్పుడు అందరితో పిలవబడుతున్న ఈ నేలకో చరిత్ర ఉంది. ఆ చరిత్రను తెలియజేసే ఆనవాళ్లు ఉన్నాయి. ఆ ఆనవాళ్లు, చరిత్రను తిరగేస్తే.. మనకు తెలియని ఎన్నో విషయాలు వాస్తవాలై కళ్ల ముందు కనిపిస్తాయి.జొన్నగిరి ప్రాంతాన్ని ఒకప్పుడు సువర్ణగిరి అని పిలిచేవారు. మౌర్య సామ్రాజ్యాధినేత అశోకుడి నాలుగో రాజధాని ఈ సువర్ణగిరి. అశోకుడి శాసనాలు ఈ ప్రాంత వైభవాన్ని చాటే సజీవ సాక్ష్యాలుగా ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. తుగ్గలి మండలంలోని జి. ఎఱ్ఱగుడి, జొన్నగిరి మధ్యన అశోకుని శాసనాలు మనకు కనిపిస్తాయి. తన సువిశాల మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలన సౌలభ్యం కోసం నాలుగు భాగాలుగా విభజించాడు అశోక చక్రవర్తి. అవే గాంధార, కళింగ, పశ్చిమ, దక్షిణ భారత రాజ్యాలు. కళింగ రాజ్యానికి తోసలి, గాంధార రాజ్యానికి తక్షశిల, పశ్చిమ రాజ్యానికి ఉజ్జయిని, దక్షిణ భారతానికి ఇప్పుడు మనం చెప్పుకున్న సువర్ణగిరిని రాజధానిగా ఏర్పాటు చేశారు. ఆ సువర్ణగిరి కాలక్రమంలో సొన్నగిరిగా మారిందని.. ఆ తర్వాత జొన్నగిరిగా స్థిరపడిందని చరిత్రకారుల అభిప్రాయం. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఉన్న కనకగిరిని సువర్ణగిరిగా చరిత్రకారులు చెప్తుంటారు. సువర్ణగిరి సరిహద్దులు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి వరకూ ఉండేవని నాటి అశోకుని శిలా శాసనాలు చెప్తున్నాయి. పత్తికొండ నియోజకవర్గంలో రెండుచోట్ల అశోకుడి శిలా శాసనాలు కనిపిస్తాయి. జొన్నగిరి నుంచి 2.5 కి.మీ దూరంలోని ఏనుగు కొండల్లో రాతి బండలపై ఈ శిలా శాసనాలను గుర్తించారు. అశోకుడి కాలంలో రాతిపలక శాసనాలను చెక్కించినట్లు చరిత్రకారులు చెప్తుంటారు. అలాంటివే జొన్నగిరి, పత్తికొండ వద్ద లభ్యమయ్యాయి. సువర్ణగిరిగా అప్పట్లో పిలుచుకున్న జొన్నగిరి ప్రాంతంలో అప్పట్లో వజ్రాలను రాశులుగా పోసి అమ్మేవారని చెప్తుంటారు. తొలకరి సమయంలో ఈ ప్రాంతంలో వజ్రాలు దొరకడం కూడా దీనికి ఆధారమని భావిస్తుంటారు. ఇప్పుడు జొన్నగిరి గోల్డ్ మైనింగ్ కారణంగా ఈ ప్రాంత చరిత్ర మరోసారి చర్చనీయాంశమవుతోంది.