బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్.. దాదాపు నెలరోజులుగా జైలులోనే..!

Wait 5 sec.

సింగరేణి సంస్థ, సింగరేణి యాజమాన్యంపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన బీఆర్‌ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తరఫు లాయర్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌కు హైకోర్టు ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే బాల్క సుమన్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను ధర్మాసనం మంజూరు చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం బాల్క సుమన్‌కు రూ.25 వేల వ్యక్తిగత బాండ్‌తో పాటు.. మరో ఇద్దరు పూచీకత్తు సమర్పించాలని నిబంధనపై బెయిల్ వచ్చింది. గతంలో సింగరేణి సంస్థపై బాల్క సుమన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీయడంతో సింగరేణి యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు.. తాజాగా బాల్క సుమన్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.బీఆర్ఎస్ నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడిన బాల్క సుమన్.. నిరసనలు తెలిపేందుకు కార్మికులు, రైతులు కలిసి రావడం లేదని.. అవసరమైతే బీఆర్ఎస్ కార్యకర్తలు మిలిటెంట్ తరహా దాడులు చేయాలని చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. కార్మికులు రోడ్ల మీదికి రావాలని.. సింగరేణి సంస్థ ఆఫీస్ కార్యాలయ అద్దాలు ధ్వంసం చేయాలని పిలుపునిచ్చారు. బాల్క సుమన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. బాల్క సుమన్‌పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే బాల్క సుమన్‌పై దేశద్రోహం సహా పలు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. బాల్క సుమన్‌ను అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు ఆదేశాలతో ఆయనను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. గత 25 రోజులుగా జైలులోనే ఉన్న బాల్క సుమన్‌కు తాజాగా బెయిల్ రావడంతో ఆయన బయటికి రానున్నారు. ఈ కేసులో జైలుకు వెళ్లడానికి కొన్ని రోజుల ముందే బాల్క సుమన్ జైలుకు వెళ్లి వచ్చారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన తీవ్ర వాగ్వాదంలో బాల్క సుమన్.. మంత్రి గడ్డం వివేక్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ కాన్వాయ్‌పై దాడి చేసినట్లు ఫిర్యాదులు రాగా.. కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.