SBI FD vs SCSS Returns: మీరు పెట్టుబడులు పెడుతుంటారా? మరి ఎక్కువగా ఎందులో ఇన్వెస్ట్ చేస్తుంటారు? మనకు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్ ఎఫ్‌డీ, పోస్టాఫీస్ స్కీమ్స్, రియల్ ఎస్టేట్, గోల్డ్, రికరింగ్ డిపాజిట్, ఆర్బీఐ స్కీమ్స్ ఇలా మనకు ఎన్నో కనిపిస్తాయి. వీటిల్లో రిస్క్ ఉన్న పథకాలు ఉంటాయి. రిస్క్ లేని పెట్టుబడి సాధనాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ వంటివి చూస్తే ఇక్కడ రిస్క్ ఉన్నా లాంగ్ రన్‌లో భారీ రిటర్న్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. రిస్క్ లేకుండా అంటే పోస్టాఫీస్ పథకాలు, బ్యాంక్ ఎఫ్‌డీ సహా ఆర్బీఐ బాండ్లు వంటివి ఉంటాయి. యువత సంగతి పక్కనబెడితే సీనియర్ సిటిజెన్ల విషయానికి వస్తే వీరు పెద్దగా రిస్క్ కోరుకోరు. రిటైర్మెంట్ సమయంలో పెద్ద మొత్తంలో రాబడి కోసం చూస్తుంటారు. స్థిర ఆదాయం కావాలని కోరుకుంటారు. కాబట్టి వీరికి ఉన్న ఆప్షన్స్ ఒకసారి చూస్తే ముందుగా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ పథకాల్లో (SCSS), మరో సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్. ఇక్కడ SCSS స్కీమ్ విషయానికి వస్తే ఒక్కసారి పెట్టుబడితో ప్రతి 3 నెలలకు ఓసారి వడ్డీ వస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో కూడా అలాంటి ఆప్షన్ ఉంటుంది. ఆర్బీఐ బాండ్లలో మాత్రమే మెచ్యూరిటీకే రాబడి వస్తుంది. పెట్టుబడి పరిమితి FD, ఆర్బీఐ బాండ్లలో లేనప్పటికీ SCSS లో గరిష్ఠంగా రూ. 30 లక్షల వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేసేందుకు వీలుంటుంది. కాబట్టి మనం ఇప్పుడు రూ. 20 లక్షల పెట్టుబడిపై ఐదేళ్లలో ఎస్బీఐ సీనియర్ సిటిజెన్స్ ఎఫ్‌డీ, ఆర్బీఐ బాండ్లు, ఎస్‌సీఎస్ఎస్ దేంట్లో రాబడి ఎలా ఉంటుందో చూద్దాం. సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో రూ. 20 లక్షలు జమ చేస్తే ప్రస్తుత 8.20 శాతం వడ్డీ రేటు ప్రకారం ఐదేళ్ల పాటు ప్రతి 3 నెలలకు ఓసారి వడ్డీ రూ. 41 వేలు వస్తుంది. అంటే ఇక్కడ రూ. 13,667 చొప్పున వస్తుందనుకోవచ్చు. బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లు సీనియర్ సిటిజెన్లకు 7-8 శాతం వరకు ఉన్నాయి. ఎస్బీఐలో ఐదేళ్ల వ్యవధికి చూస్తే 7.05 శాతంగా వడ్డీ రేటు ఉంది. ఇక్కడ రూ. 20 లక్షలు ఎఫ్‌డీ చేస్తే ప్రతి 3 నెలలకు వడ్డీ రూ. 35,250 గా ఉండొచ్చు. ఇక్కడ నెలకు రూ. 11,750 వరకు వస్తుంది.ఆర్బీఐ సేవింగ్స్ బాండ్లలో చూస్తే వడ్డీ రేటు ప్రస్తుతం 8.05 శాతంగా ఉంది. ఇక్కడ కాల పరిమితి 7 ఏళ్లుగా ఉండగా సీనియర్ సిటిజెన్లకు ముందుగా డబ్బులు తీసుకునేందుకు ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ రూ. 20 లక్షలు జమ చేస్తే 8.05 శాతం వడ్డీ రేటు ప్రకారం సంవత్సరానికి రూ. 1.61 లక్షల వరకు వస్తుంది. ఇక్కడ నెలకు చూస్తే రూ. 13,417 వరకు వస్తుంది. దీనిని బట్టి సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీంలోనే అధిక వడ్డీ రేటు కారణంగా అధిక రాబడి వస్తుంది. తర్వాత ఆర్బీఐ బాండ్లలో ఆ తర్వాత బ్యాంక్ ఎఫ్‌డీల్లో వస్తుంది. SCSS కంటే అధిక వడ్డీ రేటు బ్యాంకుల్లో ఇచ్చేవి చాలా తక్కువే ఉన్నాయి. ఉంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లోనే ఉండొచ్చు. కానీ అక్కడ కాస్త రిస్క్ ఉంటుంది.