విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టైన కృష్ణలంక సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ సంచలన విషయాలను పేర్కొంది. సాయికృష్ణ మరణించారని గుర్తించామని.. అతడిది కస్టోడియల్ డెత్‌గా తేలిందని.. మృతదేహాన్ని మాయం చేసినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. మే 5 నుంచి జూన్ 19 మధ్య కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగిందని.. సాయికృష్ణపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నా కోర్టులో హాజరుపరచలేదన్నారు. సాయికృష్ణ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారని.. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టామని సిట్ రిపోర్టులో ప్రస్తావించింది. ఈ కేసులో 17 మంది సాక్షులను ప్రశ్నించామని.. సాయికృష్ణ మృతదేహాన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో చూసినట్లు ఎస్సై కూడా వాంగ్మూలం ఇచ్చారని సిట్ తెలిపింది.సాయికృష్ణ మరణించాడని తెలిసినా కృష్ణలంక పోలీస్ సిబ్బంది ఆ సమాచారాన్ని మెజిస్ట్రేట్‌కు చేరవేయలేదని సిట్ పేర్కొంది. సాయికృష్ణ తల్లి పోలీస్ స్టేషన్‌కు వెళితే సీఐ నాగరాజు దూషించారని.. సాక్ష్యాలు నాశనం కావడానికి ఆయన కారణమన్నారు. హైకోర్టు ముందు నిజాలు దాచారని.. కోర్టును తప్పుదోవ పట్టించారని సిట్ తెలిపింది. సైంటఫిక్ ఎవిడెన్స్ చేరిపేయడం ద్వారా సాయికృష్ణ మరణించినట్లు గుర్తించామన్నారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను పూర్తిగా ధ్వసం చేశారని.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజును ప్రశ్నించాల్సి ఉందన్నారు. సాయికృష్ణ ఘటన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సీసీ ఫుటేజ్ డేటా డీవీఆర్‌లో లేకుండా చేశారని రిమాండ్ రిపోర్టులో సిట్ ప్రస్తావించింది. ఈ కేసుకు సంబంధించి కీలకంగా మారిన డీవీఆ‌ర్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని సిట్ తెలిపింది. ఇది సాధారణ మిస్సింగ్ కేసు కాదని.. ఈ కేసులో తీవ్రమైన అంశాలున్నాయని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే.. గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో అరెస్టైన సీఐ నాగరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విజయవాడలోని 2వ ఏజేఎస్ కోర్టులో సిట్ హాజరుపరిచి రిమాండ్ రిపోర్టును సమర్పించింది. సీఐ నాగరాజుకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించగా.. సీఐని నెల్లూరు జైలుకు సిట్ తరలించింది. సిట్ నాగరాజును ప్రశ్నించేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మరోవైపు సాయికృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును దర్యాప్తు చేయడానికి పోలీస్ ఉన్నతాధికారులతో సిట్ ఏర్పాటు చేసిన విషయాన్ని ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు సక్రమంగా సాగేలా చర్యలు తీసుకున్నామని.. ఈ కేసులో సీఐ నాగరాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు చెప్పారు. ఏజీ వాదనల్ని విన్న కోర్టు ఏం చేస్తారో వేచి చూద్దామంటూ ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను జులై 6కు వాయిదా వేసింది.