4 నెలల కనిష్ఠానికి క్రూడాయిల్ ధర- భారీ పతనం- నేటి పెట్రోల్, డీజిల్ ధరలివే..

Wait 5 sec.

per Barrel: సుదీర్ఘ కాలంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగిన నేపథ్యంలో విపరీతంగా పెరిగాయి. ఇటీవల అమెరికా- ఇరాన్ ఎట్టకేలకు తాత్కాలిక అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేయగా కాస్త ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. దీంతో అప్పటినుంచి ముడి చమురు ధరలు భారీగా దిగొస్తున్నాయి. గరిష్ఠ స్థాయిల నుంచి పెద్ద మొత్తంలో పతనమై ప్రస్తుతం 4 నెలల కనిష్ఠ స్థాయిలకు చేరడం ఊరట కలిగిస్తోంది. జూన్ 24న బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 75.45 డాలర్లకు పడిపోయింది. ఇవాళ ఒక్కరోజే 2 శాతానికిపైగా తగ్గింది. భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఇరాన్ యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభం కాగా అప్పుడు 70 డాలర్ల స్థాయిలో ఉన్న క్రూడాయిల్ ధర భారీగా పెరుగుతూ వెళ్లింది. ఈ క్రమంలోనే ఒక దశలో ఏకంగా 126 డాలర్ల స్థాయికి ఎగబాకింది. దాదాపు 70 శాతానికిపైగా పెరిగిందని చెప్పొచ్చు. ప్రధానంగా చమురు రవాణాకు కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధి మూతబడటంతో ఈ క్రమంలోనే పలు దేశాల్లో చమురు సంక్షోభం నెలకొంది. పలు దేశాల్లో ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి. తర్వాత మొదట కాల్పుల విరమణ, తర్వాత ఒప్పందం దిశగా అడుగులు పడటంతో చమురు ధర తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు డీల్ కుదిరిన తర్వాత మరింత తగ్గుతూ వస్తోంది. యుద్ధం ప్రారంభం నాటి నుంచి గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న చమురు నౌకలు/ట్యాంకర్లు ఇప్పుడు హార్ముజ్ జలసంధిగుండా రాకపోకలు ప్రారంభించాయి. ఇది మరింత సానుకూల పరిణామాల్ని తీసుకొచ్చింది. మరోవైపు ఇరాన్‌పై ఇన్ని రోజులు ఉన్న ఆంక్షల్ని కూడా అమెరికా సడలించింది. ఇరాన్ చమురు క్రయవిక్రయాలకు అనుమతులు ఇచ్చింది. దీంతో మార్కెట్లో చమురు లభ్యత పెరిగి ధర తగ్గుతోంది.పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయా? సమీప భవిష్యత్తులో మరింత తగ్గుతుందని భావిస్తుండగా, ఇది భారత్‌పై దిగుమతుల భారం తగ్గేలా చేస్తుంది. ఈ క్రమంలోనే రూపాయి విలువ పుంజుకోవడం సహా ద్రవ్యోల్బణం భయాలు కూడా తగ్గుముఖం పడతాయి. అయినప్పటికీ సామాన్య వినియోగదారులకు వెంటనే ఊరట కలగకపోవచ్చని భావిస్తున్నారు. క్రూడాయిల్ ధరలు తగ్గినా దేశీయంగా చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ రేట్లను ఇప్పట్లో తగ్గించే అవకాశాలు ఉండవని నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవల యుద్ధం సమయంలో మే నెలలో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు సగటున రూ. 7.50 వరకు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 115.73 గా ఉండగా, డీజిల్ లీటరుకు రూ. 103.82 గా ఉంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో హైదరాబాద్‌లోనే ఇంధన ధరలు అధికంగా ఉన్నాయి.