వెలుగులోకి వచ్చింది. ఏటీఎంలో పెట్టాల్సిన రూ.17 లక్షలు.. వ్యాన్ నుంచి చోరీకి గురి కాగా.. అది చేసింది ఆ వ్యాన్ డ్రైవరేనని పోలీసులు తేల్చారు. పాతబస్తీలోని ఐఎస్‌ సదన్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ చోరీ తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఏటీఎం సొమ్మును తన కుమారుడితో కలిసి డ్రైవర్‌ శ్రీనివాస్‌ ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే.. రూ.17 లక్షల నగదును ఏటీఎం వ్యాన్ నుంచి చోరీ చేసి తండ్రీకొడుకులు బైక్‌పై పారిపోయినట్లు తేల్చారు. చోరీ ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు.. ఉప్పుగూడలో ఉన్న మరో కుమారుడికి డ్రైవర్ శ్రీనివాస్‌ కొంత డబ్బును ఇచ్చినట్లు గుర్తించారు. కొన్ని నెలల క్రితమే ఏటీఎంలలో నగదు నింపే ఏజెన్సీ కంపెనీలో డ్రైవర్‌ ఉద్యోగంలో శ్రీనివాస్‌ చేరాడు. శ్రీనివాస్‌కు భారీగా అప్పులు కావడంతో.. వాటి నుంచి బయటపడేందుకు.. ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. జగిత్యాల సమీపంలో ఉన్న తన అత్త ఇంటి వద్ద నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్‌తో పాటు ఆయన ఇద్దరు కొడుకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే డబ్బును రికవరీ చేయడంతోపాటు.. దాని వెనుక ఉన్న కుట్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే పోలీసులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.ఐఎస్‌ సదన్‌ పరిధిలో ఉన్న ఏటీఎంలలో డబ్బులు నింపే ప్రైవేట్ ఏజెన్సీ సిబ్బంది.. కలీం అనే వ్యక్తి ఆధ్వర్యంలో రూ.30 లక్షల నగదు ఉన్న 3 బ్యాగులతో ఏటీఎంలలో డబ్బును నింపారు. ఈ క్రమంలోనే ఈది బజార్‌ ప్రాంతంలోని వికాస్‌ స్కూల్ ఎదురుగా ఉన్న ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు ఏజెన్సీ సిబ్బంది ఏటీఎంలోకి వెళ్లారు. ఆ సమయంలో ఆ వ్యాన్‌లో డ్రైవర్‌ శ్రీనివాస్‌ ఒక్కడే ఉన్నాడు. ఈ క్రమంలోనే రూ.17 లక్షలు ఉన్న బ్యాగ్‌ను తీసుకుని శ్రీనివాస్ అక్కడి నుంచి బైక్‌పై పారిపోయాడు. ఇక ఆ విషయం తెలిసిన వెంటనే కలీం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు టీంలుగా ఏర్పడి నిందితులను కనిపెట్టే పనిలో పడ్డారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు, నిందితుడి కాల్‌ లిస్ట్ పరిశీలించిన పోలీసులు.. ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి శ్రీనివాస్‌ నిందితుడు అని తేల్చారు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ తన కుమారుడితో కలిసి శ్రీనివాస్‌ బైక్‌పై పరారైనట్లు గుర్తించారు.