ఈసారి 69 అడుగుల ఖైరతాబాద్ బడా గణేష్.. పంచముఖ సంకటహార మహాగణపతి రూపంలో..!

Wait 5 sec.

దేశంలోనే ప్రసిద్ధి చెందిన వినాయక మండపాల్లో ఒకటైన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహా గణేశుడి ఉత్సవాలు నేటితో అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. తాజాగా ఈసారి ఖైరతాబాద్‌లో ప్రతిష్ఠించే మహా గణపతి నమూనా పోస్టర్‌ను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఇవాళ ఆవిష్కరించింది. ఈ క్రమంలోనే ఘనంగా కర్రపూజను నిర్వహించింది. ఈసారి 69 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని.. పంచముఖ సంకటహార మహా గణపతి రూపంలో తయారు చేయనున్నారు. ఈ విగ్రహ నిర్మాణం పూర్తి కావడానికి 82 రోజులు పట్టనుంది. ఈసారి ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహంలో సోమనాథ్ జ్యోతిర్లింగం, కాళికామాత ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. నిర్జల ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం రోజున ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ, శ్రీ గణేష్ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా కర్రపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీంతో ఖైరతాబాద్ మహా గణపతి ఉత్సవాలకు అంకురార్పణ జరిగినట్లయింది. ఈ పూజా తర్వాత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. ఈ ఏడాది అక్కడ కొలువుదీరనున్న వినాయకుడి నమూనా పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేశారు. వినాయక చవితి ఈ ఏడాది సెప్టెంబర్ 14వ తేదీన రానుండగా.. నేటితో సరిగ్గా 82 రోజులు మిగిలి ఉన్నాయి. దీంతో ఈ 82 రోజుల్లోనే సర్వ హంగులతో కూడిన 69 అడుగుల భారీ మహా గణపతి విగ్రహాన్ని పూర్తి చేస్తామని.. ఉత్సవ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు.. ఉద్రిక్తతలు తగ్గిపోయి.. అన్ని దేశాల్లో శాంతి చేకూరాలనే సంకల్పంతో ఈసారి ఖైరతాబాద్ గణేశుడిని పంచముఖ సంకటహార మహా గణపతి రూపంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తేల్చి చెప్పారు. ఈ భారీ వినాయకుడి విగ్రహానికి కుడివైపున ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన సోమనాథ్ జ్యోతిర్లింగం రూపాన్ని ఏర్పాటు చేయనున్నారు. అదే సమయంలో ఎడమ వైపున భక్తులను ఎల్లవేళలా కాపాడే కాళికామాత విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దనున్నట్లు ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది. లోక కల్యాణార్థం కొలువుదీరనున్న ఈ పంచముఖ గణపతి విశేష రూపం ఇప్పుడు భక్తులను విశేషంగా ఆకట్టుకోనుంది.