దేశ ఆర్ధిక రాజధాని ముంబయి నగరంలో దారుణం చోటుచేసుకుంది. లోకల్ రైళ్లో చిన్ని విషయమై ఇరువురి మధ్య జరిగిన గొడవ చివరకు ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. ప్రస్తుతం దీనికి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసుల కథనం ప్రకారం... చర్చ్‌గేట్‌-నల్లసపొర ఫాస్ట్‌ లోకల్‌ రైల్లో ఈ ఘటన జరిగింది. మంగళవారం రాత్రి మయాంక్‌ లోహర్‌ అనే 21 ఏళ్ల యువకుడు ఫస్ట్‌క్లాస్‌ కంపార్టుమెంట్‌లో ప్రయాణిస్తున్నాడు. అదే కంపార్ట్‌మెంట్‌లో రోషన్ సువర్ణ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. రైలు గొరేగావ్, కాండివలీ మధ్య చేరుకునే సమయంలో భారీ వర్షం కురువడంతో డోర్‌ మూసివేత విషయమై ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో మాయాంక్‌ను రోషన్ కిందపడేశాడు. ప్రయాణికులు అంతా చూస్తుండగానే తన వద్ద ఉన్న కత్తితో విచక్షణా రహితంగా పొడిచాడు. తీవ్రగాయాలలో బాధితుడు అక్కడకక్కడే మృతిచెందాడు. అతడు కత్తితో దాడిచేస్తుంటే.. అక్కడున్న వారంతా చోద్యం చూశారు. ఏ ఒక్కరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. తోటి మనిషిని చంపుతుంటే అలా చూస్తూ ఉండిపోయారు తప్పా.. కాపాడటానికి ముందుకు రాలేదు. ఇక, కాసేపు వీరంగం సృష్టించిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పశ్చిమ రైల్వే పోలీసులు కొన ఊపిరితో ఉన్న యువకుడ్ని ఆసుపత్రికి తరలించారు. నిందితుడు రోషన్‌ను కుర్లా ప్రాంతంలో అరెస్ట్‌ చేశారు. అతడ్ని కఠినంగా శిక్షించాలని మయాంక్ లోహర్ తల్లి డిమాండ్‌ చేశారు. తన సోదరుడు ఎవరికీ ఎటువంటి హాని తలపెట్టే వాడుకాదని, ఎవరితోనూ గొడవలు పడే మనిషి కాదని అతడి సోదరి కన్నీటిపర్యంతమయ్యారు. తమకు న్యాయం కావాలని, సోదరుడ్ని చంపిన హంతకుడ్ని ఉరితీయాలని ఆమె కోరారు. ఈ రోజు వాడ్ని శిక్షించకపోతే.. రేపు ఇంకొడు ఇలాగే చేస్తాడని అన్నారు. ఇక, పశ్చిమ రైల్వే పోలీసుల మాట్లాడుతూ.. డోర్ మూసివేత కోసం మొదలై ఈ వివాదం ముదిరి, కొంతమంది ప్రయాణికులు నిందితుడిపై దాడి చేయడం ప్రారంభించారు. దాడితో ఆగ్రహానికి గురైన నిందితుడు తన బ్యాగ్ నుంచి కత్తి తీసి లోహర్‌ను పొడిచాడని పోలీసులు తెలిపారు. విచక్షణారహితంగా పొడిచి, రైలు బోరవిలి స్టేషన్‌కు వస్తుందనగా దూకి పారిపోయాడుని చెప్పారు. బోరవిలికి రైలు చేరుకున్న తర్వాత జీఆర్పీ పోలీసులు.. రక్తపు మడుగులో ఉన్న యువకుడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.