ప్లాస్టిక్ వ్యర్థాలతో ఫుట్‌పాత్.. హైదరాబాద్‌లో తొలిసారి.. 50 ఏళ్ల పాటు మన్నికగా..!

Wait 5 sec.

హైదరాబాద్ నగరంలో పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే వినూత్న అడుగు పడింది. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారైన పేవర్ బ్లాకులతో నగరంలోనే తొలి ఫుట్‌పాత్‌ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) నిర్మించింది. సోమాజిగూడ సర్కిల్ నుంచి నెక్లెస్ రోడ్ ఎంఎంటీఎస్ స్టేషన్ వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర ఈ పర్యావరణహిత ఫుట్‌పాత్‌ను అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ఖైరతాబాద్ జోన్ అధికారులు చేపట్టారు. సోలార్ ఆధారిత ఫుట్‌పాత్‌ల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ప్లాస్టిక్ పేవర్ బ్లాకులతో రెండు ప్రాంతాల్లో నడకదారులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సోమాజిగూడలో పనులు పూర్తికాగా.. జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్ సమీపంలో మరో ఫుట్‌పాత్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ పేవర్ బ్లాకుల తయారీలో పాలీబ్యాగులు, ప్లాస్టిక్ బాటిళ్లు, బాటిల్ మూతలు, స్నాక్స్ ప్యాకెట్ల ర్యాపర్లు వంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించారు. ఒక్కో పేవర్ బ్లాక్‌లో సుమారు 65 శాతం నుంచి 70 శాతం వరకు కస్టమర్లు వాడి పారేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు ఉంటాయి. ఇందులో లో డెన్సిటీ పాలిథిలీన్ (ఎల్‌డీపీఈ), హై డెన్సిటీ పాలిథిలీన్ (హెచ్‌డీపీఈ) ప్లాస్టిక్‌తో పాటు మిగిలిన భాగంలో ఫిల్లర్లు, ఖనిజ పదార్థాలను కలుపుతారు. సాధారణ కాంక్రీట్ టైల్స్‌తో పోలిస్తే ఈ ప్లాస్టిక్ పేవర్ బ్లాకులు తేలికగా ఉండటంతో పాటు ఎక్కువ మన్నిక కలిగి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. నీరు లోపలికి ఇంకిపోకుండా ఈ పేవర్ బ్లాకులకు అడ్డుకునే లక్షణం ఉంటుంది. ఎక్కడైనా ఇవి దెబ్బతిన్నా మొత్తం ఫుట్‌పాత్‌ను తవ్వాల్సిన అవసరం లేకుండా.. అవసరమైన బ్లాకులను మాత్రమే తీసి కొత్తవి అమర్చే వీలు ఉంటుంది. దీంతో మెయింటెనెన్స్ ఖర్చులు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. వర్షాకాలంలో పాదచారులు జారిపడిపోకుండా మెరుగైన గ్రిప్ లభిస్తుందని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఇక వేసవిలో సాధారణ టైల్స్‌లా అధిక వేడిని విడుదల చేయవని.. కనీసం 50 ఏళ్ల వరకు ఈ బ్లాకులు మన్నికగా ఉపయోగపడుతాయని తెలిపారు. ఈ కొత్త టెక్నాలజీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోమాజిగూడ ఫుట్‌పాత్ వద్ద త్వరలో ప్రత్యేక సమాచార బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇది నగరంలోని ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధిని కలిపిన ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయి.