క్రెడిట్ కార్డు ఉన్నవారికి బిగ్ రిలీఫ్.. RBI కీలక ఆదేశాలు.. ఇక 5 రోజుల్లోనే డబ్బు వాపస్!

Wait 5 sec.

: క్రెడిట్ కార్డులు, డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ చెల్లింపుల వంటి వాటి ద్వారా జరిగే ఆర్థిక మోసాల బారినపడే ఖాతాదారులకు బిగ్ రిలీఫ్ లభించింది. సైబర్ నేరగాళ్ల బారినపడి డబ్బులు నష్టపోయే వారికి ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకుంది. క్రెడిట్ కార్డు మోసాలపై ఫిర్యాదు చేసిన కేవలం 5 రోజుల్లోనే సదరు వివాదాస్పద (తాత్కాలిక నగదు బదిలీ) ద్వారా అకౌంట్ హోల్డర్‌ ఖాతాకు జమ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. డిజిటల్ ట్రాన్సాక్షన్లలో ఖాతాదారుల బాధ్యతను పరిమితం చేసే విధంగా సవరించిన రూల్స్ విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలు జనవరి 1, 2027 నుంచి అమలులోకి తీసుకొస్తామని తెలిపింది. సైబర్ మోసాలు ఎలా జరిగినా ఖాతాదారులపై ఎలాంటి బాధ్యత పడని సందర్భాలపై రిజర్వ్ బ్యాంక్ స్పష్టత ఇచ్చింది. బ్యాంక్ వైపు ఉన్న లోపాలు లేదా నిర్లక్ష్యం కారణంగా మోసం జరిగితే ఖాతాదారు ఆ విషయాన్ని ఫిర్యాదు చేసినా, చేయకపోయినా సరే ట్రాన్సాక్షన్ రద్దు చేసి పూర్తి సొమ్మును బ్యాంకే వెనక్కి ఇవ్వాలని తెలిపింది. బ్యాంక్ లేదా ఖాతాదారు తప్పు లేకుండా ఏదైనా థర్డ్ పార్టీ హ్యాకింగ్ వల్ల మోసం జరిగితే ఆ ట్రాన్సాక్షన్ జరిగిన 5 క్యాలెండర్ రోజుల్లోపు ఖాతాదారు బ్యాంకుకు నివేదిస్తే వారిపై ఎలాంటి బాధ్యత ఉండదు. ఒక వేల 5 రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తే బ్యాంకు పాలసీ ప్రకారం నిర్ణయం తీసుకోవాలి. ఖాతాదారు మోసం జరిగిందని ఫిర్యాదు చేశాక ఆ ఖాత నుంచి మళ్లీ ఎలాంటి అనధికార ట్రాన్సాక్షన్ జరిగినా బ్యాంకులే ఆ నష్టాన్ని భరించాల్సి ఉంటుంది.దీంతో ఖాతాదారు ఎటువంటి వడ్డీ నష్టాన్ని లేదా అదనపు వడ్డీ ఛార్జీల భారాన్ని గానీ భరించాల్సిన అవసరం ఉండదు. తొలిసారి డిజిటల్ మోసాల బారినపడే బాధితుడు రూ.50 వేల లోపు నష్టానికి గురై ఫిర్యాదు చేస్తే అందులో 85 శాతం లేదా గరిష్ఠంగా రూ.25 వేల వరకు పరిహారం అందుకోవచ్చు. అయితే, ఈ సదుపాయం ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది.రూ.29,412 కంటే తక్కువ విలువ గల దేశీయ మోసాల ఫిర్యాదుల్లో 85 శాతం పరిహారం చెల్లించాల్సి వస్తే ఆ మొత్తంలో 65 శాతాన్ని రిజర్వ్ బ్యాంక్ భరిస్తుంది. మిగిలిన మొత్తంలో 10 శాతాన్ని ఖాతాదారు బ్యాంక్, ఇంకో 10 శాతం బెనిఫిషియరీ బ్యాంక్ భరిస్తాయి. వినియోగదారులే నిర్లక్ష్యంతో ఓటీపీ లేదా పాస్ వర్డ్ షేర్ చేసి నష్టపోతే అందుకు వారే బాధ్యత తీసుకోవాలి. సవరించిన ఈ కొత్త ఆదేశాలను దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులు, స్మాల్ పైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసింది.