ఇంటి నుంచి పారిపోయిన ముగ్గురు అక్కాచెళ్లెళ్లు.. హైదరాబాద్‌లో మాయమై, ఏలూరులో ప్రత్యక్షం

Wait 5 sec.

ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలు కూడా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏదైనా విషయంలో తల్లిదండ్రులు మందలిస్తే చాలు.. వారు కఠిన చర్యలకు పాల్పడుతున్నారు. వారికి వారే ఆత్మహత్యలు చేసుకోవడం.. లేదంటే తల్లిదండ్రులను చంపేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇక మరీ ముఖ్యంగా ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల ప్రపంచం కావడంతో.. పిల్లలను ఫోన్లకు అతుక్కుపోతున్నారు. అరచేతిలో ఫోన్ లేకపోతే పిచ్చోళ్ల లాగా మారిపోతున్నారు. వద్దని వారిస్తే వినకుండా తిరగబడుతున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ వ్యసనం కాస్తా వారికి కంటి చూపు, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. అయితే తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ కారణంగా ఓ కుటుంబం.. తీవ్ర ఆందోళనలో పడింది. ఫోన్ ఎక్కువగా చూస్తున్నారని ముగ్గురు బిడ్డలను వారి తల్లి తిట్టింది. దీంతో తమ తల్లి పోరు భరించలేక ఆ ముగ్గురు మైనర్ బాలికలు.. ఇంట్లో నుంచి పారిపోయారు. హైదరాబాద్ పాతబస్తీలోని ఫలక్‌నుమాకు చెందిన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్లిపోవడంతో వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. చెప్పా పెట్టకుండా ముగ్గురు కుమార్తెలు కనిపించకపోవడంతో ఆ తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. ఎంతకూ కనిపించకపోవడంతో పోలీసుల వద్దకు వెళ్లారు. తమ కుమార్తెలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తల్లిదండ్రుల ఫిర్యాదు తీసుకున్న ఫలక్‌నుమా పోలీసులు.. ఆ ముగ్గురు బాలికల వివరాలను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించి.. గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఈ కేసును రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్.శ్రీనివాస్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఆ ముగ్గురు బాలికల ఆచూకీ కనిపెట్టేందుకు స్పెషల్ టీమ్స్‌ను రంగంలోకి దించారు. అర్ధరాత్రి వరకు ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌లో ఉన్న రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్.. బాలికల దర్యాప్తును పరిశీలించారు. అయితే ఆ ముగ్గురు బాలికలు ఏలూరులో ఉన్నట్లు ఫలక్‌నుమా పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ముగ్గురు బాలికలను సురక్షితంగా ఏలూరు నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఆ తర్వాత వారిని వారి తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. ఇక ఆ బాలికలకు కౌన్సిలింగ్ ఇచ్చి.. మరోసారి ఇలాంటి తీవ్ర ఘటనలకు పాల్పడకుండా గట్టిగా మందలించారు.