బీ అలర్ట్.. మరికొన్ని గంటల్లో పిడుగులతో వర్షాలు..

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే మూడు గంటలలో పలు జిల్లాలలో పిడుగులు పడే అవకాశం ఉందని సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో హెచ్చరించింది.ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా,గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో చెట్ల క్రింద, హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని.. అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించారు. మరోవైపు రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ వరకు ద్రోణి విస్తరించి ఉందని.. దీని ప్రభావంతో మంగళవారం ఉత్తరాంధ్ర, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.మరోవైపు ద్రోణి ప్రభావంతో విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాలతో పాటుగా రాయలసీమ ప్రాంతంలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది. అయితే పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో, చెట్ల కింద ఉండొద్దని.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తోంది. వర్షం కురిసే సమయంలో కాలువలు, కల్వర్టుల సమీపంలోకి వెళ్లవద్దని అప్రమత్తం చేస్తోంది. అలాగే ఎలక్ట్రిక్ పరికరాలకు దూరంగా ఉండాలని.. వర్షం కురిసే సమయంలో మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ ఉంచి మాట్లాడవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. మరోవైపు వర్షాల ప్రభావంతో పగటి పూట ఉష్ణోగ్రతలు, ఉక్కబోత నుంచి ఉపశమనం లభిస్తుందని ప్రజలు ఊరట చెందుతున్నారు.