గతవారం ప్రారంభమైన వాడీవేడిగా సాగుతుండగా.. సోమవారం జరిగిన సరదా సంభాషణతో ఒక్కసారిగా సభలో నవ్వులు పూశాయి. కెప్టెన్ విజయ్ కాంత్ సతీమణి, డీఎండీకే అధినేత్రి, వృద్ధాచలం ఎమ్మెల్యే ప్రేమలత ఒక వినూత్న డిమాండ్ తెచ్చారు. సాధారణంగా సభలో ఎమ్మెల్యేలు అడిగినప్పుడల్లా సిబ్బంది స్టీల్ గ్లాసుల్లో నీళ్లు తెచ్చి ఇస్తుంటారు. ఈ పద్ధతికి స్వస్తి పలకాలని కోరిన ఆమె.. ప్రతి ఎమ్మెల్యే డెస్క్‌పై గాజు లేదా మంచి నాణ్యత గల పీఈటీ బాటిళ్లను ఉంచాలని అన్నారు. దీనివల్ల ప్రతిసారి సిబ్బందిని పిలవాల్సిన అవసరం లేకుండా దాహం వేసినప్పుడు ఎమ్మెల్యేలే తాగుతారని ఆమె సూచించారు.‘‘ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా నేను ఆయన ముందు ఈ డిమాండ్‌ను ఉంచుతున్నాను’’ అని ప్రేమలత అన్నారు. సభ జరుగుతున్నంత సేపు ప్రతి ఒక్కరికీ సిబ్బంది వంగి వంగి నీళ్లు అందించడం అంత బాగోలేదని ఆమె అన్నారు. ఈ సమయంలో మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే సభ్యుడు జోక్యం చేసుకుంటూ... ఇది వినడానికి ఇది మంచి ఆలోచనే కానీ, నేను దీన్ని సమర్థించలేనని అన్నారు. ఎందుకంటే కోపంలో ఉన్న ఏ ఎమ్మెల్యే చేతికైనా ఆ బాటిల్ దొరికితే అది ఒక ఆయుధంగా మారిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.‘‘కోపం వస్తే ఆ బాటిళ్లను ఒకరిపై ఒకరు విసురుకునే ప్రమాదం ఉంది’’ అని ఓపీఎస్ అనడంతో సభ అంతా ఒక్కసారిగా నవ్వులతో నిండిపోయింది. తమిళనాడు స్పీకర్ జేసీడీ ప్రభాకర్ నవ్వును ఆపుకోలేకపోయారు. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సహా సభ్యులతా పగలబడి నవ్వారు.దీనికి ప్రేమలత బదులిస్తూ ‘‘ఎవరైనా విసరాలనుకుంటే స్టీల్ గ్లాసును కూడా విసరొచ్చు కదా’’ అని అనబోతుండగా, స్పీకర్ ఆమెను ఆపి మాజీ ఆర్థిక మంత్రి, డీఎంకే ఎమ్మెల్యే తంగం తెన్నరసు మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు.తనదైన శైలిలో పంచ్‌లు వేసే తెన్నరసు ఈ చర్చకు ఇంకొంచెం హాస్యాన్ని జోడించారు. మాజీ ముఖ్యమంత్రి ఓపీఎస్ వ్యక్తం చేసిన ఈ భయం.. బహుశా ఆయనకు గతంలో ఎదురైన అనుభవాల నుంచి వచ్చిందేమోనని పంచ్ పెల్చారు. దీంతో సభలో సభ్యులంతా డెస్క్‌లు చరుస్తూ గొల్లున నవ్వారు.అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించిన ప్రేమలత.. ఈ బాటిళ్ల విధానం వల్ల ప్రభుత్వానికి అదనంగా ఖర్చు ఉండదని, పైగా ఎమ్మెల్యేలకు, అసెంబ్లీ సిబ్బందికి సమయం ఆదా అవుతుందని ఆమె అన్నారు. కానీ, ఈ ప్రతిపాదనపై స్పీకర్ గానీ, సీఎం గానీ ఎలాంటి అధికారిక నిర్ణయాన్ని ప్రకటించలేదు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు చేతుల్లో స్టీల్ గ్లాసులను పట్టుకుని, ఎమ్మెల్యేలు పిలిచినప్పుడల్లా నీళ్లు అందించడానికి సభలో అటుఇటూ సిబ్బంది తిరుగుతూ కనిపిస్తారు.