సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతో నగర పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇక వర్షాలు కురిసినప్పుడు అధికారులు, సిబ్బంది రోడ్లపైనే ఉండాలని.. నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఇటీవలె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠిన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు, హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్ పోలీసులు.. నగరవాసులకు కీలక సూచన చేశారు. ఉద్యోగులు.. ఇవాళ త్వరగా లాగౌట్ అయ్యేలా చూడాలని పేర్కొన్నారు. విద్యా సంస్థలు కూడా పిల్లలను తొందరగా ఇళ్లకు పంపించాలని హితవు పలికారు.నగరవాసుల భద్రతను దృష్టిలో పెట్టుకుని.. సైబరాబాద్ పోలీసులు ఐటీ కంపెనీలకు ఈ ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశాలు ఉండటంతో రోడ్లపై భారీగా నీరు చేరి.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ పెరిగిపోతుండటంతో.. దాన్ని నియంత్రించడానికి చర్యలు చేపట్టారు. వర్షంలో గంటల తరబడి.. కిలోమీటర్ల మేర వేచి చూడకుండా ఉండాలంటే.. ఉద్యోగులు, విద్యార్థులు తొందరగా ఇళ్లకు వెళ్లాలని పేర్కొన్నారు. కీలక ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా ఐటీ కంపెనీలు.. విద్యా సంస్థలు.. ఇతర సంస్థలు ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్నం 3:30 గంటల నుంచే దశలవారీగా ఉద్యోగులను కాస్త ముందుగానే ఇళ్లకు వెళ్లేలా ముందస్తు లాగౌట్‌ అవకాశం కల్పించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అన్ని కంపెనీల యాజమాన్యాలకు కీలక విజ్ఞప్తి చేశారు. వర్షాలు పడిన తర్వాత హడావుడిగా జనం రోడ్లపైకి రావడంతో.. వాహనాలు చిక్కుకుపోయి.. ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో నగరవాసులకు అత్యవసర సేవలను సజావుగా అందించడానికి.. రోడ్లపై వాహనాల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు, వాహనదారుల భద్రత దృష్ట్యా కంపెనీలు, యాజమాన్యాలు తమకు సహకరించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేశారు.ఇటీవల హైదరాబాద్‌లో సాయంత్రం పూట వర్షం కురిసినప్పుడు నగరవ్యాప్తంగా చాలా చోట్ల తీవ్ర ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడ్డాయి. మరీ ముఖ్యంగా కీలకమైన ఐటీ కారిడార్ ప్రాంతంలో ప్రజలు నరకం చూశారు. బయట వర్షం, కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలతో ఇళ్లకు వెళ్లేందుకు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలోనే అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీసులు ముందస్తు హెచ్చరికలు చేశారు.