పౌరాణిక, హిందూ ధర్మశాస్త్రాలలో షిరిడీ సాయి లేరు.. దేవాదాయ శాఖ మంత్రి ఆనం

Wait 5 sec.

పౌరాణిక, హిందూ ధర్మ శాస్త్రాలలో షిరిడీ సాయి లేరంటూ ఆనం రామనారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైదిక ప్రమాణాలు, ఆగమ శాస్త్రాల ప్రకారం హిందూ ధర్మాదాయ, దేవాదాయ ఆలయాల పరిరక్షణ కోసమే.. తమ శాఖ పనిచేయాలని స్పష్టం చేశారు. హిందువులుతో పాటుగా ఇతర మతాల్లోనూ షిరిడీ సాయి భక్తులు ఉన్నారని మంత్రి వివరించారు. పౌరాణిక, ధర్మశాస్త్రాలలో షిరిడీ సాయి లేరన్న ఆనం.. ఉన్న ఆలయాలను అభివృద్ధి చేసేందుకు సనాతన ధర్మ పరిరక్షణకు తాము పనిచేస్తున్నట్లు తెలిపారు. షిరిడీ సాయి ఆలయాల అభివృద్ధికి ఆర్థిక సహకారం అందించేందుకు చాలా మంది ఉన్నారని.. ఆ ఆలయాలు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయన్నారు. హిందూ ఆలయాలకు సంబంధించిన నిధులను హిందూ దేవాలయాల పరిరక్షణకు మాత్రమే ఉపయోగిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సచివాలయంలో దేవదాయ శాఖ సాధించిన విజయాలు, తీసుకొచ్చిన సంస్కరణలపై.. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా దేవాలయాలను కేవలం పూజా స్థలాలుగా కాకుండా.. హిందూ సమాజ ఆత్మగౌరవ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. కూటమి అధికారం చేపట్టిన తర్వాత గత రెండేళ్లలో 6,137 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథక వార్షిక వ్యయాన్ని రూ. 73 కోట్లకు పెంచినట్లు వివరించారు. నిర్లక్ష్యానికి గురైన 692 పురాతన ఆలయాల అభివృద్ధికై రూ. 813 కోట్ల సర్వశ్రేయోనిధి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా 5,000 శ్రీవాణి భజన మందిరాలు ఏర్పాటు చేస్తున్నామని ఆనం తెలిపారు. 22,672 దేవాలయాలకు సంబంధించిన 4.48 లక్షల ఎకరాలను కాపాడేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీతో డిజిటలైజేషన్ చేపడుతున్నామని.. మన మిత్ర వాట్సాప్ సేవలు, టీఎమ్‌ఎస్ పరిపాలనతో డిజిటల్ విప్లవాన్ని తెచ్చామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వివరించారు. 970 దేవాలయాలకు ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు చేసి.. వాటిలో బ్రాహ్మణుడు, నాయీబ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించినట్లు తెలిపారు. అన్నప్రసాద వితరణ ద్వారా సంవత్సరానికి 3 కోట్ల మంది భక్తులకు ఉచితంగా అన్నదానం అందిస్తున్నామని.. 22 ప్రధాన దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్లు రూపొందిస్తున్నట్లు వివరించారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను దేవాదాయ శాఖలో విలీనం చేయటం ద్వారా.. వేద పరిరక్షణ, అర్చక సంక్షేమానికి చర్యలు తీసుకున్నట్లు వివరించారు. 2027 గోదావరి పుష్కరాలను మహాకుంభమేళా స్థాయిలో నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.