ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత భారత్ తన తొలి టీ20 సిరీస్ ఆడనుంది. వరుసగా ఐర్లాండ్, ఇంగ్లండ్‌లపై రెండు సిరీస్‌లకు బీసీసీఐ ప్లాన్ చేసింది. అయితే, ఈ సిరీస్‌లు చాలా ప్రత్యేకం కానున్నాయి. దానికి ఏకైక కారణం ఐపీఎల్ బాస్ బేబీ . ఐపీఎల్‌లో పెను విధ్వంసం సృష్టించిన ఈ బుడ్డోడిని టీ20 సిరీస్‌లకు బీసీసీఐ సెలెక్ట్ చేసింది. అయితే, ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ప్లేయింగ్ 11లో ఆడతాడా? లేదా? అన్నదే ఆసక్తికరంగా మారింది. వైభవ్ అరంగేట్రం చేస్తే భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అతి చిన్న వయస్సులోనే ఎంట్రీ ఇచ్చిన ప్లేయర్‌గా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టడం ఖాయం. ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా ఆడాడు. 778 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకోవడమే కాకుండా మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్‌గా, మిగతా బ్యాటింగ్ అవార్డులన్నీ సొంతం చేసుకున్నాడు. తాజాగా శ్రీలంక-ఏపై జరిగిన ట్రై సిరీస్ ఫైనల్‌లో 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి తన సత్తా చాటాడు. ఒకవేళ వైభవ్ సూర్యవంశీని తుది జట్టులో తీసుకుంటే ఎవర్ని పక్కనబెట్టాలి అన్నది ఇప్పుడు కోచ్, కెప్టెన్ ముందున్న పెద్ద ప్రశ్న. టీమిండియా టాప్ 3లో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఉన్నారు. ఈ ముగ్గురూ అద్భుత ఫామ్‌లోనే ఉన్నారు. టీ20 వరల్డ్‌కప్‌లో అభిషేక్ ఫైనల్‌లో హాఫ్ సెంచరీ చేయగా.. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ భారత్ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించారు. దాంతో ఈ ముగ్గురిలో ఎవర్ని పక్కనబెడతారు అన్నదే ఆసక్తికరంగా మారింది. ఇషాన్ కిషన్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వస్తుండటంతో అతని ప్లేస్‌కి ఢోకా లేదని చెప్పొచ్చు. వైభవ్ ఓపెనర్ కాబట్టి ఇప్పుడు సంజూ శాంసన్, అభిషేక్ శర్మలో ఒకర్ని తప్పించాల్సిందే. ఒకవేళ ఈ ఇద్దర్లో ఒకర్ని మిడిలార్డర్‌కి పంపుదామన్నా.. గతంలో సంజూ స్థానంలో మార్పులు చేసి భారత్ విఫలమైంది. దాంతో ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలన్నది హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు కఠిన సవాలుగా మారింది. ప్రపంచకప్ విన్నింగ్ టీమ్‌తోనే బరిలోకి దిగితే వైభవ్ సూర్యవంశీని తొలి మ్యాచ్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేయనున్నారు. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో వైభవ్ సూర్యవంశీని ప్లేయింగ్ 11లో ఆడించాలి అన్న ఒత్తిడి భారత్‌పై ఉంది. దాంతో ఐర్లాండ్‌తో తొలి టీ 20 మ్యాచ్ ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది.