ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్ నుంచి సర్పంచ్ సాబ్‌కి బీసీసీఐ టీమిండియా టీ20 పగ్గాలు అప్పగించింది. కెప్టెన్‌గా తనను తాను ఎన్నోసార్లు నిరూపించుకున్న తర్వాత ఎట్టకేలకు టీమిండియా సారథిగా సర్పంచ్‌ సాబ్‌కి స్థానం దక్కింది. అయితే ఇన్‌స్టాగ్రామ్ బయోలో చేసిన ఓ చిన్న మార్పు సోషల్ మీడియాలో ఆసక్తిరేపుతోంది. శ్రేయాస్ అయ్యర్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ 25/12/2025 అంటూ అప్‌డేట్ చేశాడు. శ్రేయాస్ అయ్యర్ ఒరిజినల్ పుట్టినరోజు చూసుకుంటే డిసెంబర్ 6, 1994.. మరి ఈ డిసెంబర్ 25, 2025 అర్థం ఏంటా? అని అందరూ నెట్టింట వెతుకుతున్నారు. మొదట్లో ఏదో పొరపాటున వచ్చిందేమోనని అనుకున్నారు.. కానీ దాని వెనుక ఓ ప్రత్యేక కారణం ఉంది. 2025 అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ ఆఖరి మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డాడు. ఓ అద్భుతమైన క్యాచ్ అందుకున్న శ్రేయాస్ అయ్యర్ గ్రౌండ్‌లో కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో అయ్యర్‌కు స్ప్లీన్ ఇంజ్యూరీ‌తో అంతర్గత రక్తస్రావం కావడంతో కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది అన్నారు. వైద్యులు ఊహించిన దాని కంటే ముందే శ్రేయాస్ అయ్యర్ కోలుకుని డొమెస్టిక్ క్రికెట్‌లో ముంబై తరఫున పునరాగమనం చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలో రాణించి టీమిండియాలోకి తిరిగి వచ్చాడు. ఆ వెంటనే ఐపీఎల్‌లో అడుగుపెట్టడం.. కెప్టెన్‌గా పంజాబ్‌ను ప్లే ఆఫ్స్‌కు చేర్చడంలో విఫలమైనా ఆఖరి మ్యాచ్‌లో సెంచరీ చేసి బ్యాటర్‌గా తనను తాను నిరూపించుకున్నాడు. అయితే.. సోషల్ మీడియా ప్రకారం డిసెంబర్ 25, 2025శ్రేయాస్ అయ్యర్ జీవితంలో కొత్త ఆరంభానికి నాంది పలికిన రోజు కావచ్చొని తెలుస్తోంది. కేవలం ప్రాణాపాయం నుంచి బయటపడటమే కాకుండా శ్రేయాస్ అయ్యర్ తిరిగి బ్యాట్ పట్టిన రోజు కూడా 25/12/2025. తన జీవితంలో కొత్త అధ్యాయనం ప్రారంభమైన రోజు కాబట్టే.. శ్రేయాస్ అయ్యర్ సెకండ్ డేటాఫ్ బర్త్‌గా బయోలో పెట్టి ఉండొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా శ్రేయాస్ అయ్యర్ ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడమే కాకుండా టీమిండియా కెప్టెన్‌గా చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ టీ20 వరల్డ్‌కప్‌గా నిలవగా, 2026లో సూర్యకుమార్ యాదవ్ భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. ఈ సారి 2028లోనూ భారత జట్టు వరుసగా మూడోసారి ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించాలని చూస్తోంది. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో టీమిండియా హ్యాట్రిక్ టైటిల్‌ను ముద్దాడాలని యావత్ భారత అభిమానులు కోరుకుంటున్నారు.