పవిత్రమైన అయోధ్య రామ మందిర్‌లో భక్తులు సమర్పించిన విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విరాళాల నగదును అక్రమంగా మళ్లించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆరుగులు ఆలయంలో విరాళాల నగదు లెక్కించే ఉద్యోగులే కావడం విశేషం. సీసీటీవీ కెమెరాల్లో నగదును వీరు అక్రమంగా తీసుకుంటునన దృశ్యాలు కూడా నమోదైనట్లు తెలుస్తోంది. శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుకల్స్ మిశ్రా, లవ్‌కుశ్ మిశ్రా, అవినాశ్ శుక్లా, రామ్‌శంకర్ మిశ్రా, రామశంకర్ యాదవ్, మనీష్ యాదవ్, సుభాష్ చంద్ర శ్రీవాస్తవ్, కరుణేశ్ పాండే ఉన్నారు. వీరిలో రామశంకర్ యాదవ్ అనే వ్యక్తి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ డ్రైవర్‌గా పనిచేసినట్లు సమాచారం. ఆలయ విరాళాల్లో సుమారు రూ. 7 నుంచి రూ. 7.5 కోట్లు మాయమై ఉంటాయని నివేదికలు పేర్కొంటున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ సమాజ్‌వాదీ పార్టీ విరాళాల గోల్‌మాల్‌ను వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ పార్టీ అధ్యక్షుడు అకిలేశ్ యాదవ్ ఆలయ విరాళాల్లో కోట్ల రూపాయాలు మాయమవుతున్నాయని, న్యాయ విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. తొలుత సోషల్ మీడియాలో వచ్చే పుకార్లులాగే భావించినా, ఆ తర్వాత ప్రభుత్వం దర్యాప్తు చేయించాలని ఆయన పట్టుబట్టారు. ట్రస్ట్, ప్రభుత్వం మౌనం పాటించడంపై కూడా ఆయన విమర్శలు కురిపించారు. కోట్ల రూపాయల విరాళాలు చేతులు మారాయని వస్తున్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందంటూ ప్రశ్నించారు. ప్రతిపక్ష ఒత్తిళ్లలో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. లక్నో డివిజినల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, ఐజీ కిరణ్ ఎస్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ ఈ సిట్‌లో సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రధాని నరేంద్ర మోదీను కూడా విరాళాల చోరీ ఆరోపణలు ఆందోళనకు గురి చేశాయని ఆయల నిర్మాణ కమిటీ ఛైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి నృపేంద్ర మిశ్ర అన్నారు. అదేవిధంగా రామజన్మభూమి ఉద్యమ కీలక నాయకుడు, మాజీ ఎంపీ వినయ్ కూడా ఆందోళన వ్యక్తం చేశాడు.