తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల్ని టీటీడీ అలర్ట్ చేసింది. ఇటీవల భక్తులను కొందరు దళారులు మోసం చేస్తున్నారని.. తిరుమలలో శ్రీవారి దర్శనాలు, వసతి ఇప్పిస్తామని నమ్మిస్తున్నారన్నారు. భక్తులు మధ్యవర్తులు, దళారుల మాటలు నమ్మొద్దని టీటీడీ మరోసారి విజ్ఞప్తి చేసింది. తిరుమల శ్రీవారి దర్శనాలు, వసతికి సంబంధించి భక్తులను మోసం చేస్తున్న దళారులపై టీటీడీ ప్రత్యేక దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అయినా సరే భక్తుల్ని మోసపూరితమైన మాటలతో నమ్మించి డబ్బులు తీసుకుని పారిపోయే ఘటనలు జరిగాయన్నారు. ఒకవేళ దళారులు ఎవరైనా దర్శనాలు, వసతి పేరుతో భక్తుల్ని సంప్రదిస్తే వెంటనే టీటీడీ టోల్ ఫ్రీ నెంబర్ : 155257 కు ఫిర్యాదు చేయాలని సూచించారు.తిరుమల శ్రీవారిపై ఎంతో విశ్వాసంతో దర్శనం కోసం వచ్చే భక్తుల బలహీనతను ఆసరాగా చేసుకుని మోసం చేస్తున్న ఎంతటివారైనా కఠినచర్యలు తీసుకుటామని టీటీడీ హెచ్చరించింది. మరోవైపు వయోవృద్ధుల తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి సోషల్ మీడియాలో గత కొంతకాలంగా తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయని.. ఇవి పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోందని గుర్తు చేశారు. అలాగే ఈ టికెట్ పొందిన వ్యక్తికి రూ. 50 ఒక లడ్డూ ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు.తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పిహెచ్‌సి లైన్ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారని గుర్తు చేసింది టీటీడీ. కాబట్టి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలు, వదంతుల్ని నమ్మొద్దని టీటీడీ భక్తుల్ని మరోసి విజ్ఞప్తి చేసింది. తిరుమల శ్రీవారి భక్తులు సరైన సమాచారం కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org, https://ttdevastanams.ap.in ను మాత్రమే సంప్రదించాలని సూచించారు. దళారులు, మధ్యవర్తుల మాట నమ్మి మోసపోవద్దని భక్తుల్ని కోరారు.శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధిపురాణ ప్రసిద్ధి గాంచిన శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఈ మేరకు టీటీడీ జేఈవో డాక్టర్ ఏ శరత్ ఆలయాన్ని సందర్శించి భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) అధికారులతో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించారు. భారత పురావస్తు శాఖ ఆధీనంలోని ఈ ప్రాచీన ఆలయంలో చేపట్టే ప్రతి అభివృద్ధి పనికి ఏఎస్ఐ అనుమతి తప్పనిసరన్నారు జేఈవో శరత్. భక్తులకు అసౌకర్యం కలగకుండా చేపట్టగల అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి, పురావస్తు శాఖ సూచనల మేరకు ప్రతిపాదనలు సమర్పించి అనుమతులు పొందనున్నట్లు వెల్లడించారు.తాగునీటి సౌకర్యాల మెరుగుదల, క్యూ లైన్ల అభివృద్ధి, మెట్ల మరమ్మతులు, యాగశాల నిర్మాణం అనంతరం పోటు నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనులను గుర్తించినట్లు తెలిపారు. భక్తుల రాకపోకలకు మరింత సౌలభ్యం కల్పించేలా క్యూ లైన్లను సమతలీకరించి ఒకే విధమైన ఆకృతిలో తీర్చిదిద్దేందుకు ఏఎస్ఐ అధికారులు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. అదేవిధంగా కళ్యాణమండపం, ఆలయ ప్రాంగణంలోని ఇతర సౌకర్యాల అభివృద్ధికి సంబంధించి సమగ్ర నివేదిక సిద్ధం చేసి పురావస్తు శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులకు అవసరమైన అనుమతులు లభించిన వెంటనే వాటిని వేగంగా పూర్తి చేసి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని జేఈవో తెలిపారు.