Reliance Industries Market Cap: భారతదేశంలో ప్రస్తుతం బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద కంపెనీ దిగ్గజ పారిశ్రామికవేత్తగా ఉన్న ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అన్న సంగతి తెలిసిందే. దీని ఎం- క్యాప్ ప్రస్తుతం వార్త రాస్తున్న సమయంలో జూన్ 22న మధ్యాహ్నం 12 గంటలకు ఏకంగా రూ. 18 లక్షల కోట్లకుపైగా విలువతో ఉంది. జియో ఐపీఓ రాబోతున్న నేపథ్యంలో ఇదే సమయంలో ఇటీవల రిలయన్స్ ఏజీఎంలో కీలక ప్రకటనల నేపథ్యంలో రిలయన్స్ షేరు ఇవాళ పుంజుకోగా మార్కెట్ వాల్యూ భారీగా పెరిగింది. ఇక ఇప్పుడు రిలయన్స్ గ్రూప్ నుంచి మరో ఐపీఓ వస్తున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ ఇటీవల ఏజీఎంకు ముందే సెబీ దగ్గర డ్రాఫ్ట్ పేపర్స్ సమర్పించింది. ఇది ఏకంగా రూ. 38 వేల కోట్ల వరకు నిధుల్ని సమీకరించాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటివరకు హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ రికార్డు స్థాయిలో రూ. 27 వేల కోట్ల వరకు నిధుల్ని సమీకరించి టాప్‌లో ఉంది. దీంతో ఇప్పుడు జియో ఐపీఓనే ఇంకా ఎక్కువ సమీకరించి భారత్‌లోనే అతిపెద్ద ఐపీఓగా అవతరించనుంది. ఇదే సమయంలో రిలయన్స్ గ్రూప్ మరో రికార్డును కూడా సాధించనుంది. ప్రస్తుతం BSE లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటానే 4 శాతం వరకు ఉండగా ఇప్పుడు జియో ఐపీఓ విలువ కూడా తోడైతే ఇది 7 శాతం దాటనున్నట్లు భావిస్తున్నారు. మరోవైపు ప్రస్తుత షేర్ ధర దగ్గర చూస్తే గరిష్ఠంగా జియో ప్లాట్‌ఫామ్స్ మార్కెట్ విలువ రూ. 14 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో మార్కెట్ విలువ పరంగా భారత్‌లో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరిస్తుంది. అప్పుడు తొలి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, రెండో స్థానంలో రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ నిలవనున్నాయి. ఇక ఈ రెండింటి మార్కెట్ విలువ కలిపి రూ. 32-33 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 478 లక్షల కోట్ల వరకు ఉంది.ఈ క్రమంలోనే రిలయన్స్ జియో.. దిగ్గజ బ్యాంకులు, ఇతర టెలికాం మేజర్స్‌ను అధిగమించనుంది. ప్రస్తుతం మార్కెట్ విలువ పరంగా రెండో స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (రూ. 12 లక్షల కోట్లు) ఉండగా తర్వాత వరుసగా భారతీ ఎయిర్‌టెల్ (11.68 లక్షల కోట్ల), ఐసీఐసీఐ బ్యాంక్ (రూ. 9.70 లక్షల కోట్లు) ఉన్నాయి. ఈ 3 సంస్థల మార్కెట్ విలువ కలిపినా.. రిలయన్స్ గ్రూప్ మార్కెట్ విలువ కంటే తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయి.