ప్రియదర్శి హీరోగా, తెలుగు అమ్మాయి నాగదుర్గ హీరోయిన్‌గా ‘’ సినిమా షూటింగ్ గురువారం ప్రారంభమైంది. దొండపాటి వంశీరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను గురువారం విడుదల చేశారు. టైటిల్‌తోపాటు ఈ పోస్టర్ చూడగానే.. ఇది తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమా అని అర్థమవుతుంది.ఈ టైటిల్ బయటకు రాగానే.. అసలు ‘ఇడుపు కాయితం’ అంటే ఏమిటి? అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇది పక్కా గ్రామీణ తెలంగాణ పదం కావడంతో ఆంధ్ర ప్రాంతం వారితోపాటు హైదరాబాద్ లాంటి నగరాల్లో పుట్టి పెరిగిన నేటి తెలంగాణ తరంలో చాలా మందికి కూడా ఈ పదానికి అర్థం తెలియడం లేదు.ఇడుపు కాయితం అంటే.. విడాకుల పత్రం.. అంటే భార్యాభర్తలు విడిపోవడానికి పెద్దల సమక్షంలో కుదుర్చుకున్న ఒప్పంద పత్రం అన్నమాట. ఇప్పుడంటే దంపతులు విడాకుల కోసం కోర్టుకు వెళ్లి చట్ట ప్రకారం విడిపోతున్నారు. కానీ కొద్ది కాలం క్రితం కలిసి బతకలేమని నిర్ణయించుకున్న దంపతులు పెద్ద మనుషుల సమక్షంలో విడిపోవడానికి ఒక ఒప్పందం చేసుకునే వారు. దీన్నే ఇడుపు కాయితం అని పిలిచేవారు. ఇప్పటికీ తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇడుపు కాయితం రాసుకొని విడిపోతున్న జంటలు ఉన్నాయి. ఇడుపు, ఇడుసు అంటే వదలిపెట్టడం అని అర్థం. ఇడుపు కాయితం అంటే.. విడిచిపెట్టేటప్పుడు రాసుకునే అగ్రిమెంట్ అన్నమాట.ఇడుపు కాయితం పేరు సోషల్ మీడియా ఇంత చర్చకు దారి తీయడానికి ఇటీవలి కాలంలో ఆంధ్రా, తెలంగాణ నెటిజన్ల మధ్య జరిగిన సోషల్ వార్ కూడా కారణమే అని చెప్పొచ్చు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు తమది తెలుగు భాష కాదు తెలంగాణ భాష అని అనడం ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారికి ఆగ్రహం తెప్పించింది. అయితే తెలంగాణ యాసను ఎక్కిరిస్తూ కామెంట్లు చేయడమే ‘తెలంగాణ భాష’ అని అనడానికి కారణమని తెలంగాణ నెటిజన్లు పేర్కొన్నారు. అసలు తెలుగు భాష మాది అంటే మాది అనే చర్చ కూడా నడిచింది. అప్పట్లో రాజుకున్న సోషల్ చిచ్చు మళ్లీ ఇప్పుడు ఇడుపు కాయితం టైటిల్ ప్రకటనతో బయటకొచ్చింది.ఇడుపు కాయితం సినిమాకు ఆంధ్రాలో తెలుగులో డబ్బింగ్ ఉంటుందా? అని ఒకరు సెటైర్ వేస్తే.. ‘తెలుగు భాషలోనే డబ్ చేస్తారా? లేదంలే తెలంగాణ భాషలోనే చూడాలా? సబ్‌టైటిల్స్ అయినా వేయిస్తే కొంచెం హ్యాపీగా ఫీలవుతాం ఆంధ్రోళ్లం’ అంటూ మరొకరు పోస్టు చేశారు.దీంతో గతంలో తెలంగాణ ప్రజలకు ఏమాత్రం అర్థం కాని ఆంధ్రా యాస పదాలను కూడా వందల సంఖ్యలో సినిమాల్లో వాడారని.. కానీ తాము ఎగతాళి చేయలేదని.. ఇప్పుడు తెలంగాణ మాండలికానికి అర్థం అడగకుండా.. డబ్బింగ్ ఉంటుందా, ఇది అసలు తెలుగు భాషేనా కొందరు చేస్తున్న కామెంట్లు తెలంగాణ పట్ల ద్వేషాన్ని చెప్పకనే చెబుతున్నాయని మైత్రేయ అనే తెలంగాణ వ్యక్తి ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ గొడవలు సినిమా ప్రచారానికి ఉపయోగపడతాయేమో కానీ.. ఆంధ్రా, తెలంగాణ అంటూ.. తెలుగు వారి మధ్య ఇప్పటికే ఉన్న దూరం మరింత పెరిగే ప్రమాదం ఉంది.