ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో హైకోర్టు సంచలనం.. దానం నాగేందర్, కృష్ణమోహన్ రెడ్డిలు కౌంటర్ దాఖలు చేయాలని ఆర్డర్

Wait 5 sec.

: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సంచలనం సృష్టించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టు గురువారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ఖైరతాబాద్ శాసన సభ్యుడు దానం నాగేందర్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలకు హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఫిరాయింపుల పిటిషన్లపై తమ వివరణ ఇస్తూ తక్షణమే కోర్టులో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని న్యాయమూర్తులు ఆదేశించారు.స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు..!తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎమ్. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసులోని పలు రిట్ పిటిషన్లపై ఉమ్మడి విచారణ జరిపింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి.. ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి తగిన ఆధారాలు లేవంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గతంలో నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, ఆయన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ శాసన సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు.ఆధారాలున్నా చర్యలు లేవు..!ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు స్పష్టమైన సాక్ష్యాధారాలు, మీడియా క్లిప్పింగులు, పార్టీ కండువాలు కప్పుకున్న విజువల్స్‌ను స్పీకర్ ముందు ఉంచినప్పటికీ.. టెన్త్ షెడ్యూల్ ప్రకారం వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం అన్యాయమని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే స్పీకర్ కార్యాలయం ఈ ప్రక్రియను కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ఈ పిటిషన్ల జాబితాలో బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన దానం నాగేందర్‌పై తక్షణమే అనర్హత వేటు వేయాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు.జూలై 22కి విచారణ వాయిదా..ఉభయ పక్షాల వాదనలను విన్న హైకోర్టు డివిజన్ బెంచ్, ఈ వ్యవహారంలో ప్రతివాదులుగా ఉన్న దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిల అధికారిక లీగల్ స్టాండ్ ఏంటో రికార్డుల్లో నమోదు కావాలని స్పష్టం చేసింది. అందువల్ల వారు తమ పూర్తి వివరణతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం జూలై 22వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు ఇచ్చిన ఈ తాజా ఆదేశాలతో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది.