హైదరాబాద్‌లో ఇళ్లకు ఫుల్ డిమాండ్.. ఏకంగా 22 శాతం జంప్.. 3 నెలల్లోనే ఇంత మంది కొనేశారా?

Wait 5 sec.

: పశ్చిమాసియాలో దాదాపు 3 నెలలకుపైగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగి ఇప్పుడిప్పుడు పరిస్థితులు కుదుటపడుతున్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నా భారత రియల్ ఎస్టేట్ రంగం మాత్రం చెక్కుచెదరలేదు. ఈ 2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు భారీగా పెరిగాయి. పలు వర్గాల నుంచి ఇళ్లకు మంచి డిమాండ్ నెలకొనడంతో సేల్స్ పెరిగినట్లు తాజాగా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్‌ఈక్విటీ రిపోర్ట్ వెల్లడించింది. దేశంలోని మొత్తం 9 ప్రధాన నగరాల్లోనే ఇళ్ల/ఫ్లాట్ల అమ్మకాలు ఏప్రిల్- జూన్ సమయంలో (3 నెలలు) 1,12,458 యూనిట్లుగా నమోదైనట్లు పేర్కొంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే హౌసింగ్ సేల్స్ 19 శాతం పెరిగినట్లు తెలిపింది. సరిగ్గా ఏడాది కిందట ఇదే సమయంలో ఇళ్ల విక్రయాలు 94,864 యూనిట్లుగా ఉన్నాయి. ఈ 9 నగరాలు ముంబై, నవీ ముంబై, ఠాణె, ఢిల్లీ- NCR, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణె, కోల్‌కతా. అయితే వీటిల్లో ఎక్కువగా ఈసారి హౌసింగ్ సేల్స్ గ్రోత్ దక్షిణాది నగరాల్లోనే కనిపించింది. మరోవైపు కొత్త నివాస గృహాల సరఫరా వార్షికంగా 43 శాతం పెరిగి 1,17,609 యూనిట్లకు చేరుకున్నాయి. ప్రస్తుతం మార్కెట్ సెంటిమెంట్ సానుకూలంగానే ఉందని ప్రాప్‌ఈక్విటీ ఫౌండర్, సీఈఓ సమీర్ జసూజా వెల్లడించారు. దక్షిణాది మార్కెట్లు సత్తా చాటుతున్నాయని, ముంబై, నవీ ముంబై కూడా మంచి డిమాండ్‌తో దూసుకెళ్తున్నాయని అన్నారు. ఇక ఇళ్ల విక్రయాలు నగరాల వారీగా చూస్తే అత్యధికంగా నవీ ముంబైలో హౌసింగ్ సేల్స్ 61 శాతం పెరిగి 6833 యూనిట్ల నుంచి 11,029 యూనిట్లకు పెరిగాయి. బెంగళూరులోనూ ఇళ్ల అమ్మకాలు 3 నెలల కాలంలో 46 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో 14676 యూనిట్లుగా ఉండగా ఇప్పుడు అది 21,516 కు చేరింది. మరోవైపు ముంబైలో హౌసింగ్ సేల్స్ 31 శాతం వరకు పుంజుకొని 8006 యూనిట్ల నుంచి 10561 యూనిట్లకు చేరుకున్నాయి. హైదరాబాద్ నగరంలోనూ ఇళ్ల విక్రయాలు ఏప్రిల్- జూన్ సమయంలో పుంజుకున్నాయి. గతేడాది 11,815 ఇళ్లు అమ్ముడుపోగా ఈ ఏడాది ఆ సంఖ్య 22 శాతం వరకు పెరిగి 14410 యూనిట్లకు చేరుకున్నాయి. ఠాణేలో 14832 యూనిట్ల నుంచి 16386 యూనిట్లకు పెరిగాయి. పుణెలో 17196 యూనిట్ల నుంచి 18737 యూనిట్లుగా ఉన్నాయి. చెన్నైలోనూ దాదాపు 20 శాతం పెరగ్గా 6323 ఇళ్లు అమ్ముడుబోయాయి. ఇక ఢిల్లీ- NCR, కోల్‌కతాల్లో విక్రయాలు తగ్గాయి. ఇక్కడ వరుసగా హౌసింగ్ సేల్స్ 10082, 3414 యూనిట్లుగా ఉన్నాయి.