తమిళనాడు రాష్ట్రంలో ఇస్లాం మతంలోకి మారినా కూడా బ్యాక్‌వర్డ్ క్లాస్ ముస్లిం (బీసీఎం) కోటా కింద రిజర్వేషన్ పొందేలా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. న్యాయమూర్తులు జీఆర్ స్వామినాథన్, పీబీ బాలాజీతో కూడిన ధర్మాసనం తమిళనాడు తీసుకొచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమంటూ ఈ తీర్పు వెల్లడించింది. 2024 మార్చి 9న అప్పటి డీఎంకే ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం బీసీ, ఎంబీసీ, డీఎన్‌సీ, ఎస్సీ వర్గాలకు చెందిన వ్యక్తులు ఇస్లాంలోకి మారితే వారిని బ్యాక్‌వర్డ్ క్లాస్ ముస్లిం (బీసీఎం) కేటగిరిలో పరిగణించి రిజర్వేషన్ అందిస్తామని పేర్కొంది. అదేవిధంగా వారిని తమిళనాడులో గుర్తింపు పొందిన ఏడు బీసీఎం ముస్లిం వర్గాల్లో ఒకటిగా కమ్యూనిటీ సర్టిఫికెట్ జారీ చేయాలని కూడా అధికారులను ఆదేశించింది. డీఎంకే తీసుకొచ్చిన ఉత్తర్వులు చట్టబద్ధం కాదంటూ హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఇస్లాంలోకి మారిన వ్యక్తి కేవలం ముస్లిం మాత్రమే. అతను బ్యాక్‌వర్డ్ క్లాస్ ముస్లిం (బీసీఎం) హోదా కోరలేడు అంటూ కోర్టు స్పష్టం చేసింది. "హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన వ్యక్తి ముస్లింగా మారతాడు. కానీ అతను లబ్బాయి, రావుతర్, మరక్కయర్ లేదా ఇతర ప్రత్యేక ముస్లిం వర్గాలకు చెందినవాడిగా మారడు. ఆ వర్గాలు పుట్టక ఆధారంగా నిర్ణయించినవి. మత మార్పిడితో వాటిలో సభ్యత్వం పొందలేడు" అని ధర్మాసనం స్పష్టం చేసింది. తమిళనాడులో ప్రస్తుతం బీసీఎం కేటగిరిలో గుర్తింపు పొందిన ఏడు ముస్లిం వర్గాలు వివరాలు ఇవే.. అన్సార్, డెక్కాని ముస్లింలు, దూదేకుల, లబ్బాయి, మాపిళ్ల, షేక్, సయ్యద్ ఈ వర్గాలు బీసీఎం కేటగిరిలో ఉన్నాయి. 2015లో హిందూ కుటుంబంలో జన్మించిన ఓ వ్యక్తి సమీర్ అహ్మద్‌గా పేరు మార్చుకుని ఇస్లాంలోకి చేరాడు. ఆ తర్వాత తనకు ముస్లిం లబ్బాయి కమ్యూనిటీ సర్టిఫికెట్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా.. 2022లో తహసీల్దార్ ఆ దరఖాస్తును తిరస్కరించారు. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించగా.. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు రాజ్యంగ విరుద్ధమని ప్రకటిస్తూ.. సమీర్ అహ్మద్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది.