గే డేటింగ్ యాప్‌లో చాటింగ్ చేసిన ఓ డెలివరీ బాయ్‌కి ఊహించని షాక్ తగిలింది. ఓపెన్‌గా అన్ని వివరాలు చెప్పిన ఆ యువకుడు డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో పక్క ప్లాన్‌తో కిడ్నాప్ చేసి, రూ. 90 వేలు దోచుకున్న సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురి అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల మేరకు.. నాగ్‌పూర్‌కి చెందిన ఓ యువకుడు డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల గే డేటింగ్ యాప్‌‌లో రిజిస్టర్ చేసుకున్న యువకుడు నిందితుల్లో ఒకరితో పరిచయం పెంచుకున్నాడు. కొన్ని రోజులు ఇద్దరూ బాగా చాటింగ్ చేసుకున్న తర్వాత కలుద్దామని అనుకున్నారు. జూన్ 22 అర్ధరాత్రి సమయంలో డెలివరీ పని ముగించుకుని తన స్కూటీపై ఇంటికి వెళ్తూ నాగ్‌పూర్‌లోని మాంకాపూర్ చౌక్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ నిందితుల్లో ఒకరు లిఫ్ట్ కావాలని అడిగాడు. దాంతో డెలివరీ బాయ్ అతన్ని స్కూటర్‌పై ఎక్కించుకున్నాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత మరో నలుగురు స్కూటీని ఆపి డెలివరీ బాయ్‌ని బలవంతంగా కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన తర్వాత డెలివరీ బాయ్ నుంచి స్కూటీ తాళాలు, మొబైల్ ఫోన్, ఏటీఎం కార్డు లాక్కొన్నారు. అక్కడ నుంచి పలు చోట్లకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో అతడిని బెదిరించి డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. దాంతో ఫ్రెండ్స్, ఇంకా తెలిసిన వారు డెలివరీ బాయ్ అకౌంట్‌లో రూ. 90 వేలు వేశారు. కిడ్నాపర్స్ బ్యాచ్ డెలివరీ బాయ్ ఏటీఎం కార్డుతో ఆ నగదు మొత్తాన్ని డ్రా చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. జరిగిన విషయం మొత్తం పోలీసులకు చెప్పిన డెలివరీ బాయ్ ఆ ఐదుగురిపై ఫిర్యాదు ఇచ్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం వేట ప్రారంభించారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ఐదుగురు పోలీసు కస్టడీలో ఉన్నారు. గతంలో ఇలాంటి ఘటనలే ఇంకేమైనా జరిగాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.