: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న మత్తు మహమ్మారిని పూర్తిగా నిర్మూలించడానికి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పౌరులంతా చేతులు కలపాలని శుక్రవారం పిలుపునిచ్చారు. యువతను ఈ వ్యసనం నుంచి కాపాడుకోవడం ద్వారానే దేశ భవిష్యత్తును సురక్షితం చేయగలమని స్పష్టం చేశారు.ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరమంటూ..!ఈ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తికి మాత్రమే పరిమితం కాదని, అది ఒక కుటుంబంతో పాటు యావత్ సమాజాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా దేశ సంపద అయిన యువత ఈ మాయలో పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. యువతంతా చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, మంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కోరారు. ‘డ్రగ్స్ రహిత తెలంగాణ – డ్రగ్స్ రహిత భారతదేశం’ అనే గొప్ప లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్క పౌరుడు నడుం బిగించాలని గవర్నర్ పిలుపునిచ్చారు.డ్రగ్స్ ఉనికిని కనిపెట్టడం పౌరుల బాధ్యత కూడా..!మత్తు పదార్థాల వినియోగం కేవలం వ్యక్తిగత వినాశనానికే కాకుండా, సమాజంలో అనేక నేరాలకు, తీవ్రమైన శాంతి భద్రతల సమస్యలకు దారి తీస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నొక్కిచెప్పారు. డ్రగ్స్ ఉనికిని కనిపెట్టడంలో, వాటి అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కేవలం పోలీసులు, ప్రభుత్వాలే కాకుండా పౌరుల అప్రమత్తత, సామాజిక బాధ్యత ఎంతో కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. యువతలో నిరాశ, నిస్పృహలను దూరం చేసి.. వారిలో సానుకూల ఆలోచనలను పెంపొందించేందుకు సమాజం కృషి చేయాలన్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చే పవిత్ర యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీఎం కోరారు.వికారాబాద్‌లో 2కే రన్.. అవగాహన సదస్సులుఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ‘2కే రన్’ను తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ఈ పరుగులో పాల్గొని నినాదాలు చేశారు.