రీల్స్‌పై హెచ్చరించిన కునాల్ షా.. ఇప్పుడు మెటా 'వాట్సాప్' బాస్.. అసలు ఆయన మాటల వెనుక అర్థమేంటి?

Wait 5 sec.

WhatsApp Global Head Kunal Shah: భారత స్టార్టప్ ప్రపంచంలో అత్యంత విజయవంతమైన పారిశ్రామికవేత్తల్లో పేరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా చిన్న స్థాయి నుంచి పైకి ఎదిగారు. ఫిన్‌టెక్ సంస్థ క్రెడ్‌ను స్థాపించి కోట్లాది మంది క్రెడిట్ కార్డు వినియోగదారుల్ని ఒక వేదికపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు అదే కునాల్ షా మరో మెట్టు పైకెక్కారు. ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ ప్లాట్‌ఫామ్, మెటాకు చెందిన వాట్సాప్ గ్లోబల్ హెడ్‌గా నియమితులయ్యారు. త్వరలోనే బాధ్యతలు కూడా చేపట్టబోతున్నారు. మెటా సీఈఓ మార్క్ ఈయనను ఎంచుకోవడం టెక్ ప్రపంచంలో కూడా పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఈ నియామకానికి కొన్ని వారాల ముందే కునాల్ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆయన.. భారతీయులు మొబైల్ డేటాను ఎలా ఉపయోగిస్తున్నారనే అంశంపై చేసిన విశ్లేషణ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది.ప్రముఖ బ్రోకరేజీ సంస్థ గ్రో (Groww) నిర్వహించిన ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆయన- భారతదేశంలో ప్రతి వ్యక్తి నెలకు సగటున 35 GB మొబైల్ డేటా వినియోగిస్తున్నారని చెప్పారు. ప్రపంచంలో ఇదే అత్యధికం అని పేర్కొన్న ఆయన, అసలు ఇందులో ఎక్కువ భాగం రీల్స్, షార్ట్ వీడియోలు, టైంపాస్ కంటెంట్‌కే వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుత ఏఐ యుగంలో టెక్నాలజీని సరిగా ఉపయోగించే వారికి, కేవలం వినోదానికే పరిమతమయ్యే వారికి మధ్య భారీ అంతరం ఏర్పడుతోందని హెచ్చరించారు. మన భారతీయ భాషల్లో ఎఫిషియెన్సీ (సమర్థత), ప్రొడక్టివిటీ (ఉత్పాదకత) అనే పదాలకు అసలు అర్థమే లేదని, వాటికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం మన ఆలోచనా విధానంలోని లోపాల్ని చూయిస్తుందని, గంటగంటకూ సమయం విలువ గుర్తించాలని సూచించారు.ఇక ఇలా కునాల్ షా వ్యాఖ్యలు వైరల్ అవుతుండగానే మెటా ఆయనను వాట్సాప్ గ్లోబల్ హెడ్‌గా ప్రకటించడం చకచకా జరిగిపోయింది. దీంతో సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. 'రీల్స్ ఎక్కువగా చూడొద్దని చెప్పిన వ్యక్తి- ఇప్పుడు ఇన్‌స్టా రీల్స్ నడిపే మెటాలో కీలక బాధ్యతలు చేపడుతున్నాడే.' అంటూ చాలా మంది సరదా కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. కునాల్ షా ఇన్‌స్టాగ్రామ్‌ను విమర్శించలేదని, టెక్నాలజీని సమర్థంగా ఉపయోగించుకోవాలని మాత్రమే చెప్పారని అభిప్రాయపడ్డారు. వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ అన్నీ మెటాలో భాగమే అయినా.. వాటి వినియోగం పూర్తిగా యూజర్ చేతుల్లోనే ఉంటుందని పలువురు చెబుతున్నారు.ఇంకా సోషల్ మీడియాలో వచ్చిన స్పందనల్లో కొన్ని ఇక్కడ చూడండి.'రీల్స్ చూసే సమయాన్ని నేర్చుకునేందుకు ఉపయోగిస్తే జీవితమే మారిపోతుంది.', 'చౌక డేటా, 5G రావడంతో ఎంటర్‌టైన్మెంట్ కంటెంట్ ఎక్కువగా వినియోగించడం సహజమే' అని కొందరు వ్యాఖ్యానించారు. 'నిజంగా యువత బాగుపడాలంటే ఇన్‌స్టాను డిలీట్ చేసి లైబ్రరీల్లో కూర్చోవాలి. రీల్స్ బ్యాన్ చేస్తే ప్రొడక్టివిటీ 10 రెట్లు పెరుగుతుంది.' అని అంటున్నారు. కొందరేమో ప్రస్తుత ఏఐ యుగంలో సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలన్న ఆయన సందేశాన్ని సమర్థించారు.ఇక కునాల్ షా ప్రస్థానం చూస్తే ఆయన 1979లో ముంబైలో జన్మించగా, విల్సన్ కాలేజీలో ఫిలాసఫీ చదివారు. తర్వాత NMIMS లో ఎంబీఏ ప్రారంభించినా మధ్యలోనే వదిలేశారు. తర్వాత 2010లో తొలుత ఫ్రీఛార్జ్ అనే డిజిటల్ పేమెంట్స్ స్టార్టప్ స్థాపించి మంచి విజయాన్ని సాధించారు. 2015లో స్నాప్‌డీల్‌కు దీన్ని 400 మిలియన్ డాలర్లకు విక్రయించారు. 2018లో క్రెడ్‌ను స్థాపించారు. సమయానికి క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించే వారికి రివార్డులు అందించే ఈ ప్లాట్‌ఫాం అనతికాలంలోనే దేశంలోని ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. తర్వాత ఇతర రంగాల్లోకి కూడా విస్తరించింది. ఇప్పుడు అదే అనుభవంతో వాట్సాప్‌ను నెక్ట్స్ ఫేజ్‌కు తీసుకెళ్లే బాధ్యతల్ని భుజాన వేసుకున్నారు. ఏదేమైనా 'మన జీవితంలో అత్యంత విలువైన ఆస్తి డబ్బు కాదు- సమయమే. దాన్ని ఎలా ఉపయోగిస్తామన్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది.' అన్న కునాల్ మాటలు ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.