: అద్విత్ జువెల్స్ లిమిటెడ్. జైపుర్ ప్రధాన కేంద్రంగా హ్యాండ్‌క్రాఫ్టెడ్ జువెల్లరీ బ్రాండ్‌ను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఇది స్టాక్ మార్కెట్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఇన్వెస్టర్లు దీని గురించి తెగ వెతుకుతున్నారు. ఈ సబ్‌స్క్రిప్షన్ జూన్ 23న ప్రారంభం కాగా రికార్డు స్థాయిలో బిడ్స్ దాఖలవుతున్నాయి. తొలి రోజే ఏకంగా 11 రెట్లకుపైగా సబ్‌స్క్రైబ్ అవడం బట్టి దీని డిమాండ్‌ అర్థమవుతోంది. అంటే అందుబాటులో ఉంచిన షేర్ల కంటే తొలిరోజే 11 రెట్ల మేర షేర్ల కోసం అప్లై చేసుకున్నారన్నమాట. రెండో రోజు కూడా అదే రేంజ్‌లో దూసుకెళ్తోంది. మార్కెట్ ఓపెన్ కాగానే 2 గంటల వ్యవధిలోనే సబ్‌స్క్రిప్షన్ 20 రెట్లు దాటేసింది. ఈ ఐపీఓ విషయానికి వస్తే ఇష్యూ ప్రైస్ రూ. 130- 138 మధ్య ఉంది. ఒక్కో లాట్ కింద కనీసం 100 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్పర్ ప్రైస్ బ్యాండ్ దగ్గర చూస్తే కనీసం రూ. 13,800 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. సబ్‌స్క్రిప్షన్ జూన్ 23న ప్రారంభం కాగా రేపటితో (జూన్ 25) ముగుస్తుంది. జూన్ 29న షేర్ల అలాట్‌మెంట్ జరగనుండగా, జులై 1న స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తొలిరోజు సరిగ్గా 11.28 రెట్ల మేర సబ్‌స్క్రిప్షన్ నమోదవగా ఇక్కడ అందుబాటులో 83.79 లక్షల షేర్లు ఉంటే ఏకంగా 9.45 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలు చేసినట్లు ఎక్స్చేంజ్ డేటా ఆధారంగా తెలుస్తోంది. ఇక్కడ తొలి రోజు రిటైల్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్లు 11.74 రెట్లు సబ్‌స్క్రైబ్ చేసుకోగా, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 23 రెట్లకుపైగా సబ్‌స్క్రిప్షన్ చేసుకున్నారు. ఇక క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIB) 1.11 రెట్ల మేర సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. సబ్‌స్క్రిప్షన్ డిమాండ్ నేపథ్యంలోనే గ్రే మార్కెట్లో అన్‌లిస్టెడ్ షేరు దూసుకెళ్తోంది. ప్రస్తుత ఇష్యూ ప్రైస్‌తో చూస్తే దాదాపు 50 శాతం వరకు ప్రీమియం చూయిస్తోంది. ఇష్యూ ప్రైస్ గరిష్ఠ ధర రూ. 138 కాగా రూ. 200 పైనే షేరు లిస్టింగ్ కావొచ్చని అంచనా వేస్తున్నారు. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలోనే ఈ ఐపీఓ నిర్వహిస్తుండగా రూ. 165.16 కోట్ల మేర నిధుల్ని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఆ దిశగా దూసుకెళ్తోందని చెప్పొచ్చు. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా జూన్ 22న రూ. 49.52 కోట్లు సేకరించింది. ఒక్కో షేరుకు రూ. 138 చొప్పున 35.88 లక్షల షేర్లను కేటాయించింది.