తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ బాధితులకు 25 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్న బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంతోమంది నిరుపేదలు ఈ ఆస్పత్రిలో చికిత్సపొంది ప్రాణాంతక క్యాన్సర్‌ను జయించారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నిర్వహించిన రజతోత్సవ వేడుకల్లో క్యాన్సర్‌ను జయించిన కొందరు తమ అనుభవాలను పంచుకున్నారు. ఇది ఆస్పత్రి కాదు, ఓ దేవాలయం, పునర్జన్మ ప్రసాదించారంటూ ఎమోషనల్ అయ్యారు. అనంతపురానికి చెందిన స్వప్న అనే యువతి క్యాన్సర్‌ నుంచి ఎలా బయటపడ్డారో చెబుతూ చేసిన ప్రసంగం వైరల్ అవుతోంది. ఆ యువతి బసవతారకం ఆస్పత్రిలో చికిత్సపొందడానికి సాయం చేసినవారి పేరు చెబుతూ జగన్ సార్ అంటూ ప్రస్తావించారు. స్వప్న జగన్ పేరు ప్రస్తావించడంతో సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయ్యింది. ఆ యువతి చెప్పింది మాజీ సీఎం జగన్ గురించి అనుకుని కొంతమంది వైఎస్సార్‌సీపీ అభిమానులు పొరపాటుపడ్డారు. కానీ ఆమె అక్కడ ప్రస్తావించింది మాత్రం అలియాస్ జగదీష్ పేరు.. నందమూరి బాలకృష్ణకు వీరాభిమాని, అత్యంత నమ్మకస్తుడు. సోషల్ మీడియాలో బాలయ్య వీరాభిమాని అనంతపురం జగన్ పేరు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరీ జగన్.. బాలయ్యకు ఎలా అంత దగ్గరయ్యారని ఆరా తీస్తున్నారు. ఆయన అసలు పేరు జగదీష్ అలియాస్ అనంతపురం జగన్.. నందమూరి బాలకృష్ణకు వీరాభిమాని. కేవలం అభిమాని మాత్రమే కాదు.. బాలయ్యపై అభిమానంతో 'NBK Helping Hands' పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, పేదలకు సహాయం చేస్తున్నారు. బాలకృష్ణ స్ఫూర్తితో ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్‌ను ఏర్పాట్లు చేసినట్లు జగన్ చెబుతుంటారు. తన తండ్రి 2004లో చనిపోయారని.. ఆ స్థానంలో బాలయ్య తన కుటుంబానికి అండగా ఉన్నారని జగన్ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. నందమూరి బాలయ్య ఏ ఈవెంట్‌కు వెళ్లినా, ఏ కార్యక్రమానికి హాజరైనా వెంట అనంతపురం జగన్ ఉంటారు. ఎన్నో సందర్భాల్లో బాలయ్య జగన్ పేరును ప్రస్తావించారు. ప్రతి ఏటా బాలయ్య పుట్టినరోజును ప్రత్యేకంగా నిర్వహిస్తారు.. ప్రత్యేకంగా పాటలు (సిగ్నేచర్ సాంగ్స్) రూపొందించి విడుదల చేస్తుంటారు. ఆయన ఈ నెల 10న బాలయ్య పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. 'భోళా బాలయ్య' అంటూ ప్రత్యేంగా ఓ పాటను తీసి విడుదల చేశారు. జూన్ 1 నుంచి 10 వరకు వేడుకల్ని నిర్వహించి అభిమానాన్ని చాటుకున్నారు. అనంతపురం జగన్‌కు బాలయ్య అభిమానుల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. బాలయ్యకు ఫ్యాన్స్ ఉండరు.. భక్తులు ఉంటారని చెబుతుంటారు అనంతపురం జగన్. ఆయన స్ఫూర్తితో అనంతపురం జగన్ ఎంతోమంది బాలకృష్ణ అభిమానులకు సాయం చేశారు.. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనంతపురానికి చెందిన స్వప్నకు కూడా జగన్ సాయం చేశారు. స్వప్న పదోతరగతి చదువుతున్నప్పుడు బోన్ క్యాన్సర్ బయటపడింది. ఆమెను ఎన్నో ఆస్పత్రులకు తీసుకెళ్లారు.. కానీ ఆమె కోలుకోలేదు. అప్పుడు అనంతపురం జగన్‌కు విషయం తెలిసింది.. స్వప్న ఇంటికి వెళ్లి పరామర్శించారు. బాలయ్యకు స్వప్న పరిస్థితి గురించి చెప్పి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించారు. నందమూరి బాలకృష్ణ స్వప్నకు అందించిన వైద్య చికిత్సను స్వయంగా పర్యవేక్షించారు. ఆమె క్యాన్సర్ జయించారు.. తనకు పునర్జన్మ ప్రసాదించిన బసవతారకం ఆసుపత్రికి, నందమూరి బాలకృష్ణకు, అనంతపురం జగన్‌కు స్వప్న ధన్యవాదాలు తెలిపారు.