"గ్రీన్ కార్డ్ హోల్డర్లపై క్రిమినల్ కేసులు ఉంటే.. దేశం నుంచి బహిష్కరించొచ్చు": యూఎస్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Wait 5 sec.

: అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది వలసదారులకు, ముఖ్యంగా గ్రీన్‌కార్డు కలిగి ఉండి శాశ్వత నివాస హోదా పొందిన వారికి యూఎస్ సుప్రీం కోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న గ్రీన్‌కార్డు హోల్డర్లను దేశం నుంచి సులభంగా బహిష్కరించే విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ అధికారాలను సమర్థిస్తూ అత్యున్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ నిర్ణయం వలసదారుల హక్కులను తీవ్రంగా ప్రభావితం చేయనుండగా.. అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఎంట్రీ పాయింట్ వద్దే బ్రేక్..! సుప్రీం కోర్టు ధర్మాసనం 6, 3 మెజారిటీతో ఈ సంచలన తీర్పును ఇచ్చింది. దీని ప్రకారం.. నైతిక దుష్ప్రవర్తన, నకిలీ వ్యాపారాలు లేదా ఇతర తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు కేవలం ఆరోపణలు, పెండింగ్ కేసులు ఉన్న గ్రీన్‌కార్డు హోల్డర్లు విదేశాలకు వెళ్లి తిరిగి అమెరికాలోకి ప్రవేశించేటప్పుడు బోర్డర్ ఏజెంట్లు వారిని అడ్డుకోవచ్చు. దేశంలోకి నేరుగా ప్రవేశం కల్పించకుండా 'ఇమ్మిగ్రేషన్ పరోల్' కిందకు మార్చి, వారి గ్రీన్‌కార్డులను నిలిపివేసే అధికారం అధికారులకు లభించింది.గతంలో సరిహద్దు వద్దే గ్రీన్‌ కార్డును ప్రశ్నించడానికి పక్కా ఆధారాలు కావాలని లోయర్ కోర్టులు చెప్పగా.. సుప్రీం కోర్టు ఆ నిబంధనను కొట్టేసింది. నేరం జరిగి ఉంటుందని నమ్మడానికి బలమైన కారణం ఉంటే చాలని జస్టిస్ క్లారెన్స్ థామస్ స్పష్టం చేశారు. దీనిపై లిబరల్ జడ్జి కేతన్జీ బ్రౌన్ జాక్సన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కోర్టు ప్రభుత్వానికి ఒక అపరిమితమైన ‘బ్లాంక్ చెక్’ ఇచ్చిందని, ఇది వలసదారులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.చైనా జాతీయుడి కేసుతోనే గుట్టురట్టు..!చైనా జాతీయుడైన మక్ చోయ్ లూ కేసు సందర్భంగానే ఈ తీర్పు వచ్చింది. 2007లో గ్రీన్‌కార్డు పొందిన మక్ చోయ్‌పై 2012లో న్యూజెర్సీలో నకిలీ ట్రేడ్‌మార్క్ దుస్తుల అమ్మకాలకు సంబంధించిన క్రిమినల్ అభియోగాలు నమోదు అయ్యాయి. ఆ కేసు కోర్టులో ఉండగానే అతడు చైనాకు వెళ్లి.. జూన్ 2012లో న్యూయార్క్ ఎయిర్‌పోర్టు ద్వారా అమెరికాకు తిరిగి వచ్చాడు. అతనిపై పెండింగ్ కేసులు ఉన్నందున ఎయిర్‌పోర్ట్ అధికారులు అతనికి సాధారణ ప్రవేశాన్ని నిరాకరించి, కఠిన షరతులతో కూడిన పరోల్‌పై అనుమతించారు. ఆ తర్వాత కోర్టులో మక్ చోయ్ తన తప్పును అంగీకరించడంతో అతనికి దేశ బహిష్కరణ ఆదేశాలు జారీ అయ్యాయి. తాను చేసిన తప్పు నైతిక దుష్ప్రవర్తన కిందికి రాదని, దాని వల్ల కాకముందే బోర్డర్ వద్ద తనను అడ్డుకోవడం చట్టవిరుద్ధమని అతడు కోర్టును ఆశ్రయించాడు. కానీ తాజాగా సుప్రీం కోర్టులో అతనికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.