: అమెరికా లూసియానాలోని కంపెనీ కథ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 43 ఏళ్లుగా ఒక కుటుంబ యాజమాన్యంలో నడుస్తున్న ఈ ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్ తయారీ సంస్థను వాకర్ కుటుంబం 1.7 బిలియన్ డాలర్లకు అమ్మేసింది. మన కరెన్సీలో చూస్తే ఇది దాదాపు రూ. 16 వేల కోట్ల కంటే ఎక్కువగానే ఉంటుంది. పవర్ మేనేజ్మెంట్ దిగ్గజం ఈటన్ సంస్థ దీనిని కొనుగోలు చేయగా.. ఈ డీల్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది కంపెనీ విక్రయం కానే కాదు.. ఆ కంపెనీ కార్మికులు/ఉద్యోగుల కోసం యజమాని తీసుకున్న నిర్ణయమే ప్రత్యేకంగా నిలిచింది. కంపెనీ మాజీ సీఈఓ గ్రాహమ్ వాకర్ ఈ డీల్‌పై ఒక ప్రత్యేక షరతుతోనే సంతకం చేశారు. కంపెనీ విక్రయం ద్వారా వచ్చే మొత్తంలో సుమారు 15 శాతం ఉద్యోగులకు ఇవ్వాలని పట్టుబట్టారు. ముఖ్యంగా ఆ ఉద్యోగుల్లో ఎవరికీ కంపెనీలో ఒక్క షేరు కూడా లేకపోవడం గమనార్హం. అయినప్పటికీ వారి కష్టానికి గుర్తింపుగా వాకర్ కుటుంబం గొప్ప నిర్ణయం తీసుకుంది.ఈ ఒప్పందం ప్రకారం దాదాపు 1.7 బిలియన్ డాలర్లకు విక్రయించగా ఇందులో 15 శాతం అంటే 240 మిలియన్ డాలర్లను 540 మంది ఉద్యోగులకు పంపిణీ చేశారు. ఈ 240 మి. డాలర్లు భారత కరెన్సీలో దాదాపు రూ. 2200 కోట్లకుపైనే ఉంటుంది. ఈ లెక్కన ఒక్కో ఉద్యోగికి సగటున రూ. 4 కోట్లకుపైనే వస్తుంది. బోనస్ లెటర్స్ అందుకున్న ఉద్యోగులు మొదట దీనిని నమ్మలేకపోయారు. కొందరు ఇదేదో ఫన్నీగా చేశారనుకుంటే ఇంకొందరు అసలు విషయం తెలుసుకొని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. కొందరు ప్రాంక్ షో కోసం ఎక్కడైనా హిడెన్ కెమెరాలు పెట్టారా? అని అడగడం గమనార్హం. ఇక్కడ బోనస్ సొమ్మును ఒకేసారి కాకుండా ఐదేళ్ల కాలంలో ఉద్యోగులకు అందిస్తారు. 65 ఏళ్లు పైబడిన వారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వడంతో వారు అదే రోజు రిటైర్మెంట్ ప్రకటించి ఇంటికి వెళ్లిపోయారు. అగ్నిప్రమాదాన్ని తట్టుకొని సంక్షోభానికి ఎదురొడ్డి..1982లో ఫైబర్‌బాండ్ సంస్థను స్థాపించగా ఈ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. 1998లో ఈ కంపెనీ భారీ అగ్నిప్రమాదానికి గురైంది. తర్వాత డాట్‌కామ్ సంక్షోభం కారణంగా ఈ వ్యాపారం తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంది. ఉద్యోగుల సంఖ్య 900 నుంచి 320 కి పడిపోయింది. అయితే వాకర్ కుటుంబం ఉద్యోగుల్ని వదిలేయకుండా కష్టకాలంలో కూడా వేతనాల్ని చెల్లించింది. ఆ విశ్వాసమే తర్వాత కంపెనీ విజయానికి బాటలు వేసింది. డేటా సెంటర్ మౌలిక సదుపాయాలపై 150 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడం కంపెనీకి టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. కొవిడ్ తర్వాత క్లౌడ్ సేవలు, ప్రస్తుతం ఏఐ డేటా సెంటర్ల డిమాండ్ పెరగడంతో ఫైబర్‌బాండ్ అమ్మకాలు ఐదేళ్లలో ఏకంగా 400 శాతం పెరిగాయి. ఈ క్రమంలోనే మార్కెట్లోని పెద్ద పెద్ద సంస్థలు దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించాయి. ఉద్యోగుల జీవితాలే మారిపోయాయి..బోనస్‌తో వచ్చిన సొమ్ముతో ఫ్యాక్టరీ ఉద్యోగుల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. 1995లో గంటకు కేవలం 5.35 డాలర్ల జీతంతో ఉద్యోగంలో చేరిన ఉద్యోగిని లెసియా తన హోం లోన్ పూర్తిగా తీర్చేసి కొత్తగా క్లాత్ బొటిక్ వ్యాపారం ప్రారంభించింది. 67 ఏళ్ల హాంగ్ బ్లాక్‌వెల్ రిటైరయి తన భర్తకు కొత్త టయోటా టకోమా వెహికిల్ కొనిచ్చింది. ఇంకొందరు కుటుంబాలతో విదేశీ పర్యటనలు ప్లాన్ చేసుకున్నారు. సాధారణంగా ఏదైనా కంపెనీ అమ్మకం ద్వారా యజమాని లేదా పెట్టుబడిదారులే అధికంగా లాభపడతారు. కానీ ఫైబర్‌బాండ్ కంపెనీలో మాత్రం ఉద్యోగులకు జాక్‌పాట్ తగిలిందని చెప్పొచ్చు. లాభాలు మాత్రమే కాదు, ఉద్యోగుల విశ్వాసానికి ఎంత విలువ ఉంటుందో ఈ సంఘటన గుర్తుచేస్తోంది.