హైదరాబాద్ శివారులో 1500 ఏళ్ల నాటి అద్భుత ఆలయం.. వన్ డే ట్రిప్ కోసం బెస్ట్ ప్లేస్.. రూట్ మ్యాప్ ఇదే..

Wait 5 sec.

హైదరాబాద్ నగరంలోని కాంక్రీట్ జంగిల్ సంస్కృతికి అలవాటుపడిన నగరవాసులు వీకెండ్ వచ్చిందంటే చాలు.. కాస్త ప్రశాంతత కోసం, మానసిక ఉల్లాసం కోసం ప్రకృతి రమణీయత ఉట్టిపడే ప్రదేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల అనేక పర్యాటక ప్రాంతాలు, రిసార్టులు అందుబాటులో ఉన్నప్పటికీ.. వందల ఏళ్ల నాటి చారిత్రక వైభవం, భక్తిభావం, ప్రకృతి సౌందర్యం కలగలిసిన ఆధ్యాత్మిక క్షేత్రాలు ఇచ్చే అనుభూతి ప్రత్యేకమైనదనే చెప్పాలి. అలాంటి అద్భుతమైన, ఇప్పటికీ చాలా మందికి తెలియని ఒక రహస్య ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రమే రంగారెడ్డి జిల్లాలోని జన్నయ్య గుట్ట ఛత్రగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం. నగర శివారు మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామ పరిధిలో కొలువై ఉన్న ఈ పుణ్యక్షేత్రం వీకెండ్‌లో కుటుంబ సమేతంగా ప్రశాంతమైన దైవదర్శనం కోసం వెళ్లాలనుకునే వారికి ఒక బెస్ట్ డిస్టినేషన్‌గా నిలుస్తోంది.1500 ఏళ్ల నాటి చారిత్రక వైభవం స్థానికులు, చరిత్రకారుల పరిశోధనల ప్రకారం.. ఈ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రానికి దాదాపు 1500 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఈ ఆలయం ప్రాచీన రాష్ట్రకూటులు, లేదా కళ్యాణి చాళుక్యుల కాలం నాటిదని ఇక్కడి శిల్పకళా శైలిని బట్టి గుర్తించారు. ఈ కొండపై ఉన్న సహజసిద్ధమైన గుహలు, ప్రాచీన శిలా నిర్మాణాలు ఆధ్యాత్మికతకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఇక్కడి నరసింహ స్వామి వారు గుహలో స్వయంభూవుడిగా వెలిశారని ప్రతీతి. పూర్వం ఇక్కడ జన్నయ్య అనే మహా ముని స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేయడం వల్లనే ఈ కొండకు జన్నయ్య గుట్ట అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. దీనికి నిదర్శనంగా కొండపై స్వామివారి పవిత్ర పాద ముద్రలు కూడా భక్తులకు దర్శనమిస్తాయి. 'ఛత్రగిరి' పేరు వెనుక రహస్యంఈ కొండకు మరో విశిష్టమైన పేరు ఉంది, అదే ఛత్రగిరి. ఈ కొండ పైభాగం దూరం నుంచి చూసినప్పుడు ఒక పెద్ద గొడుగు (ఛత్రం) ఆకారంలో కనిపిస్తుంది. ఎండ వానల నుంచి భక్తులను కాపాడే ఛత్రం వలె ఈ కొండ ఆకృతి ఉండటం వల్ల దీనిని ఛత్రగిరి అని పిలుస్తారు. కొండపైకి వెళ్లే కొద్దీ చుట్టూ ఉన్న దట్టమైన పచ్చదనం, ఎత్తైన గుట్టలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీని ఇష్టపడే వారికి, ట్రెక్కర్స్‌కి, బర్డ్ వాచర్స్‌కి ఈ ప్రాంతం ఒక స్వర్గధామంలా అనిపిస్తుంది.హైదరాబాద్ నుంచి ఎంత దూరం?నగరంలోని వివిధ ప్రధాన ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి రోడ్డు మార్గంలో సులభంగా ప్రయాణించవచ్చు. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి సుమారు 25 నుంచి 28 కిలోమీటర్లు, ఎల్బీనగర్ నుంచి సుమారు 20 కిలోమీటర్లు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 12 నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి సొంతవాహనాలు ఉత్తమం. సిటీలో ఎక్కడి నుంచైనా సరే.. ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కి ఎగ్జిట్ నంబర్ 14 వద్ద కిందకు దిగాలి. అక్కడ నుండి తుక్కుగూడ జంక్షన్ మీదుగా రావిర్యాల గ్రామం వైపు వెళ్లే రోడ్డులో ప్రయాణించాలి. రావిర్యాల విలేజ్ దాటిన తర్వాత కొద్ది దూరంలోనే ప్రకృతి రమణీయత నడుమ జన్నయ్య గుట్ట నరసింహస్వామి ఆలయ స్వాగత తోరణం కనిపిస్తుంది. అక్కడి నుండి కొండపైకి నిర్మించిన ఘాట్ రోడ్డు ద్వారా వాహనాల్లో నేరుగా ఆలయం వద్దకు చేరుకోవచ్చు. ఒకవేళ ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాలనుకుంటే.. ఎంజీబీఎస్, ఎల్బీనగర్, చార్మినార్ నుంచి తుక్కుగూడ లేదా మహేశ్వరం వెళ్లే బస్సులు ఎక్కి అక్కడ దిగి లోకల్ ఆటోల ద్వారా కొండ వద్దకు చేరుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీకెండ్‌కు ఫ్లాన్‌ చేసుకోండి.