ఇడుపు కాయితం సినిమా పేరు రేపిన వివాదం ఇప్పుడు తెలుగు రాజకీయాలను తాకింది. ఏమిటంటూ సోషల్ మీడియాలో కొంతమంది పెట్టిన పోస్టులు వివాదాస్పదమయ్యాయి. మరికొందరు తెలంగాణ మాండలికాన్ని అవమానించవద్దంటూ ఈ పోస్టులకు కౌంటర్లు ఇవ్వటంతో.. వ్యవహారం సోషల్ మీడియా వార్‌గా మారింది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ అధినేత్రి చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇడుపు కాయితం అంటే అర్థం తెలియదంటూ కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారన్న కవిత.. అలాంటి వాళ్లు పవన్ కళ్యాణ్‌ను అడిగితే ఆయన అర్థం చెప్తారంటూ జనసేనానిపై సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్‌కు ఇడుపు కాయితం అంటే అర్థం బాగా తెలుసంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ భాషను అవమానించినందుకే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామన్న కవిత.. మరోసారి ఇలాంటి వెకిలి ప్రయత్నాలు చేయడం మానుకోవాలని సూచించారు. భాషలను పరస్పరం గౌరవించుకుందామని.. అలా కాదని తెలంగాణ భాషను అవమానించాలని చూస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇడుపు కాయితం అంటే విడాకుల పత్రం అని అర్థం. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ కవిత ఇలాంటి సెటైర్లు వేశారనే కామెంట్లు సోషల్ మీడియాలో పేలుతున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నేతలు కవిత వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు. సందర్భం లేకుండానే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి కామెంట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇడుపు కాయితం అర్థం ఏమిటో పవన్ కళ్యాణ్‌ను అడగాలంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై జనసేన నేత, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే స్పందించారు. చిప్ప కూడు అనే పదానికి అర్థం ఏమిటో కల్వకుంట్ల కవిత.. తెలంగాణ ప్రజలకు చెప్పాలంటూ కౌంటర్ ఇచ్చారు. లిక్కర్ కేసులో అరెస్టైన కవిత గతంలో కొన్ని రోజులు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ బొలిశెట్టి శ్రీనివాస్ ఈ ట్వీట్ చేశారు. మొత్తంగా సినిమా పేరు వివాదం కాస్తా ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ జనసేనగా మారింది.