ఇంగ్లండ్ కెప్టెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై రిటైర్మెంట్ ప్రకటిస్తూ అందరికీ షాక్ ఇచ్చాడు. న్యూజిలాండ్‌తో నాటింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మధ్యలోనే తన రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. బెన్ స్టోక్స్ డెసిషన్‌కు టీమ్‌మేట్స్‌తో పాటు క్రికెట్ అభిమానులు కూడా ఇంకా షాక్‌లోనే ఉన్నారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మధ్యలో బెన్ స్టోక్స్ మాట్లాడుతున్న ఒక వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. కెప్టెన్‌గా, ఇంగ్లండ్ తరఫున కూడా తాను ఆడే చివరి రెండు రోజులు ఇవే అంటూ స్టోక్స్ చెప్పాడు. తన రిటైర్మెంట్‌కు అసలు కారణాలు త్వరలోనే చెబుతాను అని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. బెన్ స్టోక్స్ మాట్లాడుతూ "రాబోయే రెండు రోజుల్లో ఒక విషయం జరగబోతోంది. ఇవే మీ కెప్టెన్‌గా నా చివరి రెండు రోజులు కూడా. అలాగే ఇంగ్లండ్ తరఫున ఆడే నా చివరి రెండు రోజులు కూడా. దీనికి కారణాలు తర్వాత చెబుతాను. ఈ జట్టు కోసం, మీ కోసం, ఇంతకుముందు ఉన్న వాళ్ల కోసం నేను ఎన్నోసార్లు నా శక్తినంతా పెట్టాను. ఇప్పుడు కూడా మరోసారి అదే చేయబోతున్నాను " అని అన్నాడు. "నేను కోరేది ఒక్కటే మీలో ప్రతి ఒక్కరూ కూడా జట్టు కోసం పోరాడాలి. ఇంకా మన ముందున్న రెండు రోజుల్లో చాలా పని ఉంది. మ్యాచ్ ఫలితం ఎలా వచ్చినా, ఈ జట్టులోని ప్రతి ఆటగాడు, ఒక మహిళా సిబ్బంది సభ్యురాలు కూడా తమ శక్తినంతా పెట్టారని భావిస్తూ మైదానం వీడాలని కోరుకుంటున్నాను. నా కోసమే కాదు, ఈ జట్టు భవిష్యత్ కోసం కూడా అందరూ తమ శాయశక్తులా పోరాడాలి. భావోద్వేగాలు, అభినందనలు అన్నీ ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత చూసుకుందాం. ఇప్పటికైతే మైదానంలోకి వెళ్లి మరో రెండు రోజులు పూర్తి స్థాయిలో పోరాడుదాం" అని బెన్ స్టోక్స్ ముగించాడు. 35 సంవత్సరాల బెన్ స్టోక్స్ 2011లో ఇంగ్లండ్ తరఫున వైట్ బాల్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 2022 నుంచి టెస్టు జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇంగ్లండ్ తరఫున ఎన్నో అద్భుత ప్రదర్శనలు చేశాడు. ముఖ్యంగా యాషెస్ సిరీస్‌లో సెంచరీ చేసి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన దాన్ని క్రికెట్ అభిమానులు ఎవ్వరూ మరచిపోలేరు. న్యూజిలాండ్‌తో మొదటి టెస్టు తర్వాత నైట్ క్లబ్‌లో రగ్బీ ప్లేయర్‌తో జరిగిన వివాదమే స్టోక్స్ రిటైర్మెంట్‌కు ప్రధాన కారణమని తెలుస్తోంది.