ప్రపంచాన్ని వరుస భూకంపాలు కుదిపేస్తున్నాయి. వెనిజులాలో వరుసగా రెండు భూకంపాలు సంభవించడంతో ఆ దేశం ఒక్కసారిగా వణికిపోయింది. జపాన్‌లో కూడా ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. జపాన్ ఉత్తర ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూకంపం నమోదయినట్లు అధికారులు చెబుతున్నారు. వెనిజులాలో సునామీ హెచ్చరికలు నమోదు చేయగా, జపాన్‌కి మాత్రం అలాంటి హెచ్చరికలు రాలేదు. ఉత్తర జపాన్‌లోని ఇవాటే ప్రాంత తీరానికి సమీపంలో భూకంపం నమోదైందని అధికారులు చెబుతున్నారు. భూమికి 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు. ఈ భూకంపం సంభంవించిన వెంటనే ప్రజలు భయాందోళనలకు గురై, వెంటనే ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. భారీ నష్టం చేకూరలేదని.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదని చెబుతున్నారు. ఈ భూకంప తీవ్రతకు ఇళ్లలోని గోడలు ఊగి అక్కడ ఉన్న ఫొటోఫ్రేమ్‌లు మాత్రమే కిందపడినట్లు హషికామి పట్టణానికి చెందినవారు చెబుతున్నారు. జపాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ ప్రసారం చేసిన దృశ్యాల్లో హచినోహే నగరంలో ట్రాఫిక్ యథావిధిగా కొనసాగడం, ట్రాఫిక్ సిగ్నళ్లు సక్రమంగా పనిచేయడం కనిపించింది. ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే దేశం ఏదైనా ఉందంటే అది జపానే. ఇది పసిఫిక్ మహాసముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో నాలుగు ప్రధాన టెక్టానిక్ ప్లేట్ల ప్రాంతంలో ఉండటంతో ఎక్కువగా భూకంపాలు, సునామీలు సంభవిస్తుంటాయి. ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో భూకంపాలు సంభవిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే భూకంపాల్లో సుమారు 18 శాతం జపాన్‌లోనే చోటుచేసుకుంటాయి. ఈ ఏడాది ఏప్రిల్ 20న కూడా ఇవాటే ప్రిఫెక్చర్ సమీపంలోని పసిఫిక్ జలాల్లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో అధికారులు అధికారులు 8.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాల ప్రమాదం పెరిగిందంటూ ప్రత్యేక హెచ్చరిక జారీ చేశారు. ఆ వెంటనే ఇప్పుడు 6.9 తీవ్రతతో నమోదవ్వడం విశేషం. 2011లో సునామీ వచ్చిన సమయంలో జపాన్‌లో భూకంప తీవ్రత 9.0గా నమోదయింది. మళ్లీ అలాంటి పరిస్థితులు వస్తాయేమోనని జపాప్ ప్రజలు ఆందోళనలో ఉన్నారు.