: భారతదేశంలో బంగారానికి మంచి డిమాండ్ ఉంటుంది. బంగారాన్ని ఎక్కువగా వినియోగించే దేశాల్లో చైనాతో పాటు ముందు వరుసలో ఉంటుంది. అయితే దానికి తగ్గట్లుగా దేశీయంగా మన దగ్గర అంత బంగారం అందుబాటులో ఉండదు. అందుకే ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. ముఖ్యంగా మహిళలు మన దగ్గర బంగారు ఆభరణాల్ని కొనుగోలు చేసి ధరించాలని ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇటీవల డిమాండ్ కాస్త తగ్గిందని చెప్పొచ్చు. గోల్డ్, సిల్వర్ రేట్లు రికార్డు స్థాయి గరిష్ఠాలకు చేరడం అందుకు కారణం. ముఖ్యంగా గత సంవత్సరంలో బంగారం ధర 70 శాతం, వెండి రేటు సుమారు 150 శాతం వరకు పెరిగాయి. ఈ క్రమంలోనే సామాన్యులకు అందని స్థాయికి పెరిగాయి.అయితే ఎట్టకేలకు గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పడిపోతున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో అమెరికా- ఇరాన్ ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి పడుతూనే ఉన్న పసిడి, వెండి ధరలు ఇప్పుడు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలతో మరింత పడుతోంది. తాజాగా దేశీయంగా, అంతర్జాతీయంగా బంగార, వెండి రేట్లు ఏకంగా 7 నెలల కనిష్ఠ స్థాయిలకు పడిపోవడం గమనార్హం.పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ద్రవ్యోల్బణం పెరగ్గా.. దానిని అదుపులోకి తెచ్చేందుకు యూఎస్ పెంచాలని చూస్తోంది. ఈ సెప్టెంబరులో వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ కారణంతోనే యూఎస్ డాలర్ పుంజుకొని దాదాపు 13 నెలల గరిష్టాలకు చేరింది. దీనికి తగ్గట్టుగా గోల్డ్ రేట్లు పతనం అవుతున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఇప్పుడు ఔన్సుకు 4 వేల డాలర్ల మార్కు దిగువకు చేరింది. ప్రస్తుతం జూన్ 25న వార్త రాసే ఉదయం 7 గంటల సమయంలో 3980 డాలర్ల వద్ద ఉంది. సిల్వర్ 57 డాలర్ల దిగువకు చేరింది. ఇక్కడ ఆల్ టైమ్ హై నుంచి చూస్తే భారీగా దిగొచ్చాయి. దేశీయంగా బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్ నగరంలో ఇవ్వాళ రూ. 250 తగ్గగా 22 కారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 1,32,300 వద్ద ఉంది. కిందటి రోజు ఏకంగా రూ. 3100 తగ్గింది. ఇక 24 క్యారెట్ల పుత్తడి ధర చూస్తే తులం రూ. 1,44,330 వద్ద ఉంది. ఇవి 2025 నవంబర్ నాటి కనిష్టాలకు చేరాయి. అంటే 7 నెలల దిగువకు ధర పడిపోయిందన్నమాట. మరోవైపు సిల్వర్ ధర ఒక్కరోజులో రూ. 10 వేలు తగ్గి కిలోకు రూ. 2.40 లక్షలకు పడిపోయింది.