తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. టీటీడీ భక్తుల కోసం ప్రతి నెలా ఆన్‌లైన్‌లో సేవా టికెట్లు, దర్శన టికెట్లను, వసతి గదుల్ని విడుదల చేస్తోంది. సెప్టెంబర్ నెలకు సంబంధించి టీటీడీ ఆన్‌లైన్ కోటాను విడుదల చేసింది.. బుధవారం (జూన్ 24న) రోజు తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను విడుదలయ్యాయి. ఈ టికెట్లు బుక్ చేసుకోవడానికి ప్రయత్నించిన కొందరు భక్తులు సాంకేతిక సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ సమస్యను ప్రస్తావించారు.. తాము ఎంత ప్రయత్నించినా టికెట్లు బుక్ చేసుకోలేకపోయామంటున్నారు. అక్కడ టికెట్లు ఉన్నట్లు చూపిస్తున్నా బుక్ చేసుకుందామని ప్రయత్నిస్తే కావడం లేదంటున్నారు.తిరుమల తిరుపతి దేవస్థానం వారు.. సెప్టెంబర్ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుకింగ్‌లో సమస్య ఎదురవుతోందని అమరేంద్ర అనే నెటిజన్ ట్వీట్ చేశారు. తనకు ఎదురైన సమస్యను తెలియజేస్తూ.. వివరాలు, స్క్రీన్‌షాట్‌లను జతచేవారు. దయచేసి సహాయం చేయాలని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దయచేసిన ఈ విషయాన్ని పరిశీలించాలని కోరారు. టీటీడీ వారు దయచేసి వెబ్‌సైట్ నిర్వహణ, టెక్నికల్ టీమ్‌ను మెరుగుపరచాలని కోరారు. జనవరి 2026 నుంచి టీటీడీ వెబ్‌సైట్ విశ్వసనీయత క్రమంగా తగ్గిపోతోందని.. బుకింగ్‌ల సమయంలో భక్తులకు ఇబ్బందులను కలిగిస్తోందని ఆరోపించారు.సెప్టెంబర్ 27న జరిగే ఎస్డీ సేవను బుక్ చేసుకోవడానికి.. జూన్ 23వ తేదీన ఉదయం సరిగ్గా 10 గంటలకు టీటీడీ పోర్టల్‌లోకి లాగిన్ అయ్యానని మరో నెటిజన్ చెప్పుకొచ్చారు. అక్కడ బుక్ చేసుకోవడానికి స్లాట్ ఉన్నట్లు గ్రీన్ కలర్‌లో ఉందని.. కానీ బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే ప్రతి స్లాట్ ఎర్రర్‌ను చూపించిందన్నారు. పలు తేదీలను ప్రయత్నించినా అదే ఫలితం వచ్చిందని.. స్లాట్‌లను ఎలా కేటాయిస్తున్నారనే దానిపై టెక్నికల్ ఆడిట్, పారదర్శకతను కోరుతున్నానన్నారు. మరో నెటిజన్ తాను సెప్టెంబర్ దర్శనం టిక్కెట్ల కోసం పేమెంట్ పూర్తి చేశానని.. టీటీడీ యాప్‌లో అది విఫలమైనట్లు చూపిస్తోందని.. ఈ విషయాన్ని పరిశీలించాలని కోరారు. తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న చాలా మందికి ఇదే సమస్య ఎదురవుతోందని నెటిజన్లు అంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదని.. గతంలో టికెట్ల బుకింగ్ చాలా సాఫీగా ఉండేదని.. దయచేసి దీని వెనుక ఉన్న ఐటీ టీమ్‌ను మార్చాలని కోరుతున్నారు. అత్యంత సంపన్నమైన ఆలయం అయినా వారు సైట్‌ను ఎందుకు విస్తరించడం లేదని ప్రశ్నిస్తున్నారు. చాలామంది భక్తులు ఇలాంటి సమస్య ఎదురైందంటూ స్పందిస్తున్నారు. మరి టీటీడీ దర్శన టికెట్లు, వెబ్‌సైట్ సమస్య గురించి ఎలా స్పందిస్తుందో చూడాలి.