ఏపీకి రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలతో పాటుగా ఎండలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఈదురుగాలులతో వానలు పడతాయంటున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామారజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే మిగతాచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈనెల 26, 27 తేదీల్లో కోస్తా, రాయలసీమలోని జిల్లాల్లో వర్షాలు, అక్కడక్కడా భారీ వానలు పడతాయంటున్నారు. అయితే రాష్ట్రంలో మిగిలినచోట్ల ఎండ తీవ్రత ఉంటుందన్నారు. రాష్ట్రంలో శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయంటున్నారు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందంటున్నారు. అలాగే వర్షాలు పడే సమయంలో ఈదురు గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. మరోవైపు బుధవారం రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎండ తీవ్రత, ఉక్కపోత వాతావరణం కొనసాగింది. కొన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. పల్నాడు జిల్లా జంగమహేశ్వరపురంలో 39.5 డిగ్రీలు, తిరుపతిలో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తేమగాలుల కారణంగా సాయంత్రం ఉత్తరాంధ్రలోని పలు జిల్లాలు, కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వానలు పడ్డాయి. రాష్ట్రంలో ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించారు. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వర్షం పడే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని.. ఆ సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు వంటి వాటి కింద నిలబడొద్దన్నారు. జనాలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. తాజా వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు కూడా విస్తరించనున్నాయి.