ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 710మంది మహిళా పోలీసులకు ఐసీపీఎస్, మిషన్ శక్తి పర్యవేక్షణ బాధ్యతల్ని అప్పగించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13వేల912మంది మహిళా పోలీసులు విధుల్లో ఉన్నారు. వీరంతా ఏ శాఖ పరిధిలో పనిచేయాలనే అంశంపై సచివాలయాలశాఖ ఆప్షన్స్ ఎంచుకునే అవకాశం కల్పించింది. వీరిలో 710 మంది మహిళా పోలీసులు మహిళా శిశు సంక్షేమ శాఖను ఎంపిక చేసుకున్నారు. ఈ క్రమంలో ఆ శాఖకు అవసరమైన 710మంది మహిళా పోలీసుల్ని ప్రభుత్వం కేటాయించింది. మహిళా పోలీసులు ప్రస్తుతం సర్‌ (సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ) విధుల్లో ఉన్నారు.. అది ముగిసన తర్వాత ఐసీపీఎస్, మిషన్ శక్తి పర్యవేక్షణ బాధ్యతల్ని తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో మొత్తం 257 ప్రాజెక్టులున్నాయి. ఒక్కో ప్రాజెక్టు పరిధిలో మూడు నుంచి నాలుగు మండలాలు ఉన్నాయి. ప్రస్తుతం మహిళా శిశు సంక్షేమ శాఖకు కేటాయించిన 710 మందిని మండలానికి ఒకరు చొప్పున ప్రభుత్వం నియమించనుంది. మహిళా పోలీసులకు ఏ జిల్లా పరిధిలోని వారికి ఆ జిల్లాలోనే అవకాశం కల్పించనున్నారు. ప్రస్తుతానికి మహిళా పోలీసులు డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తించాలని చెబుతోంది ప్రభుత్వం. ఆ తర్వాత ప్రమోషన్లపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే మహిళా పోలీసులు నిర్వహించాల్సిన విధులపై కూడా కొత్త మార్గదర్శకాలు విడుదల చేశారు. మహిళా పోలీసుల్ని రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, చిన్నారుల రక్షణకు సంబంధించిన విధులకు మాత్రమే పరిమితమన్నారు. మహిళా పోలీసులు మహిళా సాధికారిత, బాలల సంరక్షణ, బాలల హక్కుల పరిరక్షణ, మిషన్ వాత్సల్య, బాల్య వివాహాలు నిరోధం, బాల కార్మికుల గుర్తింపు, వన్‌స్టాప్ సెంటర్లు, పోక్సో కేసులకు సహాయక సేవలు, మానవ అక్రమ రవాణా నిరోధం, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ ఇలా పలు కార్యక్రమాల్లో వీరి సేవల్ని ఉపయోగించుకుంటారు. మహిళా పోలీసుల్ని ఐసీడీఎస్‌ పోషకాహార కార్యక్రమాల అమలు, అంగన్వాడీ సెంటర్ల నిర్వహణ, స్టాక్‌ రిజిస్టర్ల నిర్వహణ వంటి పనులకు ఉపయోగించకూడదని కూడా ప్రస్తావించారు. మహిళ-శిశు రక్షణకు సంబంధంలేని పరిపాలనా పనులు కూడా అప్పగించకూడదని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.